
1995లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'బొంబాయి' సినిమాలోని ప్రతీ పాట ఒక మాస్టర్‌పీస్. అందులోనూ ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ స్వరపరచగా.. హరిహరన్, కె.ఎస్. చిత్ర గాత్రంలో రూపుదిద్దుకున్న "ఉరికే చిలకా" పాట ప్రేక్షకులను మైమరిపించిన తీరు నిజంగా వర్ణనాతీతం.
ఈ పాట కథాగమనంలో అత్యంత కీలకమైన ఘట్టంలో వస్తుంది. హీరో శేఖర్ (అరవింద్ స్వామి), హీరోయిన్ శైలా బాను (మనీషా కోయిరాలా) ల మధ్య ఉన్న నిశ్శబ్ద ప్రేమ, వారిని విడదీసే సామాజిక-మతాల గోడలు, ఆ సమయంలో వారి గుండెల్లో రగిలే విరహ వేదనను ఈ పాట ప్రతిబింబిస్తుంది.
ఈ పాటకు వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించారు. పాట ఆరంభంలోనే నాయకుడు తన ప్రేయసి కోసం పడే తపనను వేటూరి అద్భుతంగా వర్ణించారు.
పల్లవి:
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుక కళ్ళతో కాటువేసావు నన్నేపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు
భావం:
ప్రియురాలిని చిలకతో పోలుస్తూ, ఆమె ఎంత దూరంగా ఉన్నా జీవితాంతం ఎదురుచూస్తానని ప్రేమికుడు చెబుతున్నాడు. ఆమె ప్రేమ చిన్న చినుకులా ప్రారంభమై, తన హృదయమంతా ఉప్పొంగే ప్రవాహమైపోయిందని వర్ణిస్తాడు. ప్రియురాలిని తనకు చెలిగా, సఖిగా భావిస్తూ.. ఇద్దరి మనసుల్లో దాగిన ప్రేమకథను ఆమెనే వినాలని కోరుతున్నాడు. ఇద్దరి మధ్య దూరం కారణంగా జీవితం భారంగా మారిపోయిందని, ఆ విరహవేదనను ఒక్కసారి అర్థం చేసుకోవాలని కోరుతున్నాడు. ఆమె చూపులు తనను ఎప్పుడో ప్రేమలో బంధించాయని చెబుతున్నాడు. ఒకవేళ ప్రేమ దక్కక మరణిస్తే.. కాస్త మట్టేసి పోవాలని ఎంతో వేదనతో చెబుతున్నాడు.
చరణం 1:
నీ రాక కోసం తొలిప్రాణమైనా దాచింది నా వలపే
మనసంటి మగువా ఏ జాము రాక చితిమంటలే రేపే
నా కడ ప్రాణం పోనివ్వు కథ మాసిపోదు అదికాదు నా వేదన
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే యద కుంగిపోయేనులే
మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా
భావం:
నీ రాక కోసం నా ప్రేమను ఇంతకాలం ప్రాణంలా దాచుకున్నాను. నా మనసును అర్థం చేసుకున్న మగువా.. నువ్వు ఏ క్షణాన వస్తావో తెలియని ఎదురుచూపే నాలో చితిమంటలు రేపుతోంది. నా చివరి శ్వాస పోయినా మన ప్రేమకథ మాత్రం చెరిగిపోదు. కానీ నా బాధ అది కాదు. విధి ఎంత దారుణంగా మారినా.. నీ మీద ఎవరైనా నింద వేస్తే మాత్రం నా హృదయం తట్టుకోలేదు. నా ప్రేమకు మొదలు నువ్వే.. ముగింపు కూడా నువ్వే. నా జీవితాన్ని పూర్తిగా నీకే అప్పగించేశాను అని ఎంతో గొప్పగా చెప్పారు.
చరణం 2:
తొలిప్రాణమైనా ఒకనాటి ప్రేమా మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి ముడుపాయనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లే వచ్చా నీ వేణు గానానికి
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
భావం:
జీవితంలో మొదటిసారి మనసును తాకిన ప్రేమను కాలం గడిచినా మర్చిపోలేం. అది గతంలో జరిగిన ప్రేమ అయినా, దాని జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఒక కంటి నుండి కన్నీరు కారుతుంటే, ఆ బాధను చూస్తూ మరో కన్ను సంతోషించలేదు. అలాగే, ఒకే శరీరంలోని రెండు కళ్ళలాంటి ప్రేమికులు ఒకరి విరహాన్ని చూసి మరొకరు ఎలా ప్రశాంతంగా ఉండగలరు అని ఎంతో గొప్పగా రాశారు.
సామాజిక అపవాదులు, కట్టుబాట్లు వారి ప్రేమపై నిందలు వేసినా, ఈ ప్రాణం పోయినా సరే మన పవిత్రమైన ప్రేమ కథ ఎప్పటికీ మాసిపోదు అనే ఆత్మవిశ్వాసాన్ని ఈ పాట కలిగిస్తుంది. రెహమాన్ సంగీతం మనసును తాకుతుంటే, హరిహరన్, చిత్ర గాత్రం ఆ విరహ వేదనకు ప్రాణం పోశాయి. అందుకే 30 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఈ పాట అదే అనుభూతిని కలిగిస్తోంది.
[Urike Chilaka Song Lyrics Telugu, Urike Chilaka Song Meaning, Bombay Telugu Movie Songs, AR Rahman Telugu Songs, Veturi Best Songs, Bombay Movie Songs, Arvind Swamy, Manisha Koirala, Best Telugu Songs]






