
ఒక సినిమాలో ఒకట్రెండు క్యారెక్టర్లు చేసి మెప్పించడమే అంత తేలికైన విషయం కాదు. అలాంటిది ఒకే సినిమాలో మూడు పాత్రలు చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. మరి టాలీవుడ్ లో ట్రిపుల్ రోల్ చేసి మెప్పించిన హీరోలు ఎవరో చూద్దాం.
టాలీవుడ్ లో ఒకే సినిమాలో ఎక్కువ రోల్స్ చేసిన హీరో.. ANR. 1966లో విడుదలైన 'నవరాత్రి' సినిమాలో.. ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. ఇప్పటికీ ఆ రికార్డు ANR పేరు మీదే ఉంది.
ట్రిపుల్ రోల్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ సెట్ చేసింది 'సీనియర్ ఎన్టీఆర్'. 1977లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ 'దాన వీర సూర కర్ణ'లో.. ఆయన కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు అనే మూడు శక్తివంతమైన పాత్రలను పోషించారు. ఆ మూడు క్యారెక్టర్లలో ఆయన చూపించిన వైవిధ్యం, డైలాగ్ డెలివరీ ఎవర్‌గ్రీన్.
ఆ తర్వాత 1979లో వచ్చిన ‘శ్రీమద్ విరాటపర్వం’ సినిమాలో ఏకంగా ఐదు పాత్రలు పోషించారు ఎన్టీఆర్. కృష్ణుడు, అర్జునుడు, దురోధ్యనుడు, బృహన్నల, కీచకుడు.. ఇలా ఐదు పాత్రలు పోషించి మెప్పించడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.
ఇక ఈ లిస్టులో అత్యధిక సార్లు ట్రిపుల్ రోల్స్ చేసి రికార్డు సృష్టించిన హీరో ఎవరో తెలుసా.. సూపర్ స్టార్ కృష్ణ. అసలు ఒక సినిమాలో మూడు పాత్రలు చేయడమే కష్టం అంటే.. ఆయన ఏకంగా ఏడు సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'కుమార్ రాజా', 'పగబట్టిన సింహం', 'డాక్టర్ సినీ యాక్టర్', 'సిరిపురం మొనగాడు', 'రక్తసంబంధం', 'బంగారు కాపురం', 'బొబ్బిలి దొర' సినిమాల్లో కృష్ణ మూడు పాత్రల్లో నటించి అలరించారు.
అలాగే, సోగ్గాడు శోభన్ బాబు కూడా 1983లో వచ్చిన 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాలో మూడు వైవిధ్యమైన క్యారెక్టర్లు చేసి మెప్పించారు.
ఇక చంద్రమోహన్ సైతం 'డ్యామిట్ కథ అడ్డం తిరిగింది' అనే సినిమాలో ట్రిపుల్ రోల్‌లో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. 1994లో వచ్చిన 'ముగ్గురు మొనగాళ్లు' సినిమాలో పృథ్వి, విక్రమ్, దత్తాత్రేయ అనే మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి థియేటర్లలో విజిల్స్ వేయించారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ కలగలిపిన ఆ పాత్రల్లో చిరు మేనరిజమ్స్ నెక్స్ట్ లెవెల్.
నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ట్రిపుల్ రోల్ లో తనదైన ముద్ర వేశారు. 2012లో వచ్చిన 'అధినాయకుడు' సినిమాలో తాత, తండ్రి, మనవడుగా మూడు తరాల పాత్రల్లో కనిపించి తన మాస్ నటనతో అభిమానులను ఖుషీ చేశారు.
ఇక ఈ జనరేషన్ లో ట్రిపుల్ రోల్ లో మెప్పించిన హీరోగా.. జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2017లో వచ్చిన 'జై లవకుశ' సినిమాలో.. జై, లవ, కుశ అనే ముగ్గురు కవల సోదరులుగా ఆయన నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న 'జై' క్యారెక్టర్‌లో తారక్ చూపించిన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు.
అలాగే ఈ జనరేషన్ హీరోల్లో.. 'అమిగోస్'లో నందమూరి కళ్యాణ్ రామ్, 'మామా మశ్చీంద్ర'లో సుధీర్ బాబు కూడా మూడు పాత్రలు పోషించారు.
ఇంకో విశేషం ఏంటంటే.. ఒక స్టార్ హీరో తన అప్ కమింగ్ మూవీలో ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఆ స్టార్ ఎవరో కాదు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అట్లీ డైరెక్షన్లో చేస్తున్న 'రాకా' మూవీలో ఆయన మూడు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. 'తగ్గేదేలే' అంటూ పుష్పరాజ్ గా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. ట్రిపుల్ రోల్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
[Tollywood Heroes Triple Roles, Telugu Heroes Triple Roles, Daana Veera Soora Karna Movie, Navaratri Movie, NTR Triple Role, Krishna Triple Role, Megastar Chiranjeevi, Nandamuri Balakrishna, Jai Lava Kusa, Raaka Triple Role]





