
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కాస్త విరామం తర్వాత 'నీరం' అనే వైవిధ్యమైన చిత్రంలో ఒక కీలకమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె 'తెలుగువన్'కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తన కెరీర్, కూతురు సుప్రీత ఎంట్రీ, సోషల్ మీడియా ట్రోల్స్, పరిశ్రమలో మారుతున్న పరిణామాలపై ఆసక్తికరంగా మాట్లాడారు.
ఈ చిత్రంలో ఆమె ఒక బాధ్యతాయుతమైన డాక్టర్, అలాగే ఒక కూతురికి తల్లిగా కనిపించబోతున్నారు. సినిమా కథ ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుందని, అందుకే ఈ పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఆమె వెల్లడించారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో తలకు గుండు చేయించుకున్న లుక్‌లోనే నటించాల్సి వచ్చిందని సురేఖ వాణి తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఉన్న అపారమైన భక్తితో తాను మొక్కు చెల్లించుకోవడానికి తలనీలాలు సమర్పించానని, ఆ సమయంలో విగ్ వేసుకోవాలా అని ఆలోచిస్తుంటే దర్శకుడు కృష్ణ గారు వద్దని వారించి, అదే సహజ లుక్‌తోనే నటించాలని కోరారని చెప్పారు. అంతేకాకుండా తన చేతిపై శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల టాటూ కూడా వేయించుకున్నానని, దేవుడిపై తనకున్న నమ్మకమే తనను ముందుకు నడిపిస్తోందని వివరించారు.
'నీరం' చిత్రం 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళంలో కూడా సురేఖ వాణి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తమిళంలో ధనుష్ సరసన 'ఉత్తమ పుత్తిరన్' (తెలుగు 'రెడీ' రీమేక్) చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత తమిళ అగ్ర హీరోలైన అజిత్, విజయ్ వంటి స్టార్ల సినిమాల్లోనూ మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషించారు.
అయితే ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గడంపై స్పందిస్తూ, ప్రస్తుతం సినిమాల్లో కథల వైవిధ్యం మారిపోయిందని, ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణ గారు లేదా ఎస్.వి. కృష్ణా రెడ్డి గారి సినిమాల్లో పదుల సంఖ్యలో నటీనటులకు మంచి క్యారెక్టర్లు లభించేవని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు సినిమాల్లో తల్లిదండ్రుల పాత్రలకే స్కోప్ తగ్గిపోయిందని, అందువల్లే సీనియర్ ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు ఎప్పటికైనా ఒక పూర్తిస్థాయి పనిమనిషి పాత్రలో నటించాలనే కోరిక ఉందని సురేఖ వాణి తన డ్రీమ్ రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత తరం క్లాసిక్ సినిమా 'సంసారం ఒక చదరంగం'లో నటి మనోరమ పోషించిన 'చిలకమ్మ' పాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందేనని, ఆ సినిమాలో పది మంది ముఖ్య పాత్రలు ఒకెత్తయితే, ఆ ఒక్క పనిమనిషి పాత్ర మరొక ఎత్తుగా నిలుస్తుందని ఆమె ప్రశంసించారు. అటువంటి వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యమున్న రోల్ వస్తే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
తన కూతురు సుప్రీత గురించి మాట్లాడుతూ, తను ఇప్పుడే సినీ ఇండస్ట్రీలోకి బడ్డింగ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టిందని, తన సొంత నిర్ణయాలతో మెచ్యూర్డ్‌గా ముందుకు సాగుతోందని చెప్పారు. సమయ పాలన పాటించడం ఒక్కటే తన కూతురికి ఇచ్చిన ముఖ్యమైన సలహా అని తెలిపారు. సుప్రీతకు ప్రారంభంలో మంచి పల్లెటూరు నేపథ్యం ఉన్న మాస్ క్యారెక్టర్ వస్తే నటిగా మంచి గుర్తింపు లభిస్తుందని ఆకాంక్షించారు.
అలాగే సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత ట్రిప్స్, ఫోటోలపై వచ్చే కామెంట్స్ గురించి చెబుతూ, అనవసరమైన కాంట్రవర్సీలకు దూరంగా ఉండేందుకే ఇటీవల ట్రిప్స్‌కి సంబంధించిన పోస్టులు పెట్టడం మానేశామని అన్నారు. మనస్శాంతిగా, సంతోషంగా జీవించడమే తన ఫిట్‌నెస్ సీక్రెట్ అని చిరునవ్వుతో చెప్పుకొచ్చారు.
Surekha Vani, Interview, Niram Movie






