Home

»

Exclusive Movie News

Peddi: రామ్ చరణ్ సాక్షాత్తూ హనుమంతుడిలా కనిపించారు.. ఆ షాట్ చూసి ఎన్టీఆర్ ఏమన్నారంటే?

Jun 1, 2026 12:09PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఒక చిన్న అబ్బాయి రామ్ చరణ్‌కు అదిరిపోయే ఎలివేషన్ ఇస్తూ కనిపించాడు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు.. సయ్యద్ గఫూర్. ‘తెలుగువన్’(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గఫూర్ ‘పెద్ది’ మరియు జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ (Dragon) షూటింగ్ విశేషాలను, తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను పంచుకున్నాడు. (Actor Sayed Gafur Interview)

సయ్యద్ గఫూర్ చిన్నతనంలోనే (ఐదేళ్ల వయసులో) తల్లిదండ్రులను రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. కర్నూలు జిల్లా దొన్నిపాడు గ్రామానికి చెందిన గఫూర్‌ను వాళ్ల అమ్మమ్మ, మామయ్య పెంచారు. నటనపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ వచ్చి, అన్నపూర్ణ స్టూడియోస్ యాక్టింగ్ అకాడమీలో శిక్షణ పొందాడు. గతంలో ‘అఖండ’ సినిమాలో నటించినప్పటికీ కొన్ని ముఖ్యమైన సీన్స్ ఎడిటింగ్‌లో పోవడంతో నిరాశ చెందాడు. కానీ ఇప్పుడు ‘పెద్ది’, ‘డ్రాగన్’ వంటి క్రేజీ ప్రాజెక్టులలో కీలక పాత్రలు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

‘పెద్ది’ ఆడిషన్స్ అనుభవాన్ని చెప్తూ.. దాదాపు 300 మందిలో బుచ్చిబాబు గారు తనను సెలెక్ట్ చేశారని గఫూర్ తెలిపాడు. అయితే, వేరే వెబ్ సిరీస్ షూటింగ్ వల్ల తను తెల్లగా మారిపోవడంతో, ‘పెద్ది’ షూటింగ్ సెట్‌లో బుచ్చిబాబు గారు గుర్తుపట్టలేదని అన్నాడు. విలేజ్ బాయ్ లుక్ కోసం వెంటనే టాన్ కావలసి రావడంతో.. సమయం లేక బాత్రూం పక్కన ఉన్న మట్టిని ఒంటికి, మొహానికి రాసుకుని అండర్‌వేర్‌తోనే మానిటర్ ముందుకు వెళ్లానని ఆనాటి కష్టాన్ని గుర్తుచేసుకున్నాడు. రామ్ చరణ్ సార్ షాట్ కోసం ఎదురుచూస్తున్న ఆ సమయంలో, తను సింగిల్ టేక్‌లోనే ఆ ఎలివేషన్ డైలాగ్ చెప్పి బుచ్చిబాబు గారిని మెప్పించానని సంతోషంగా చెప్పాడు.

సెట్‌లో రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ గురించి గఫూర్ అద్భుతంగా వివరించాడు. చరణ్ సార్ పూర్తిగా వెజిటేరియన్ బాడీని మెయింటైన్ చేస్తున్నారని, ఆయన మజిల్స్ చూస్తే సాక్షాత్తూ హనుమంతుడిని చూసినట్లు అనిపించిందని అన్నాడు. చేతికి గాయమైనా లెక్కచేయకుండా ప్రతి షాట్‌కు ముందు డిప్స్ కొడుతూ ఎంతో కష్టపడ్డారని శ్లాఘించాడు. ‘రంగస్థలం’ కంటే ముందు వచ్చిన రామ్ చరణ్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ‘పెద్ది’ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అని.. బుచ్చిబాబు గారు చరణ్ సార్‌ను నటనలో పిండేశారని గఫూర్ అన్నాడు.

ఇక ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ ల ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ అనుభవాలను కూడా గఫూర్ పంచుకున్నాడు. ఒక సీన్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు స్వయంగా తన వైట్ ట్రాక్ ప్యాంటును కూడా లెక్కచేయకుండా బొగ్గుల మట్టిలో మోకాళ్లపై కూర్చుని తనకు నటన నేర్పించారని చెప్పాడు. ఆ తర్వాత తన షాట్ చూసి క్యారవాన్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సార్ ఎంతో అప్రిషియేట్ చేశారని ఆనందం వ్యక్తం చేశాడు. 

చైల్డ్ ఆర్టిస్ట్ గఫూర్ పూర్తి ఇంటర్వ్యూతో పాటు మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం 'తెలుగువన్' (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com