
తారాగణం: కెన్ కరుణాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ తదితరులు
రచన, దర్శకత్వం: కెన్ కరుణాస్
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
విడుదల తేదీ: మార్చి 27, 2026
ఇటీవల కోలీవుడ్ నుంచి యూత్ ని ఆకట్టుకునేలా పలు రొమాంటిక్ కామెడీ సినిమాలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులను కూడా ఇవి ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు తమిళ నుంచి మరో రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ వచ్చింది. అదే 'యూత్'. 'అసురన్'లో తన నటనతో మెప్పించిన కెన్ కరుణాస్.. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా, డైరెక్షన్ కూడా చేయడం విశేషం. ఇప్పటికే తమిళ్ లో విడుదలై, సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ తాజాగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..? (Youth Movie Review)
కథ:
ప్రవీణ్ (కెన్ కరుణాస్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. స్కూల్ లైఫ్ పూర్తయ్యేలోపు ఎలాగైనా ఒక అమ్మాయిని ప్రేమలో పడేయాలని తపన పడుతుంటాడు. కానీ అతని అల్లరి పనుల వల్ల స్కూల్‌లో ఎవరూ అతన్ని పట్టించుకోరు. ఈ క్రమంలోనే ప్రవీణ్ జీవితంలోకి గంగవల్లి (అనిష్మ అనిల్ కుమార్), ప్రేషిక (మీనాక్షి దినేష్), సోనాల్ (ప్రియాన్షీ యాదవ్) అనే ముగ్గురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. వీరి రాకతో ప్రవీణ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ప్రేమలో తగిలిన దెబ్బలు అతన్ని ఎలా మార్చాయి? తన తల్లిదండ్రుల కలలను ప్రవీణ్ నెరవేర్చాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
సాధారణంగా టీనేజ్ లవ్ స్టోరీలంటే ఎక్కువగా అల్లరి పనులు మాత్రమే చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో దర్శకుడు కెన్ కరుణాస్ ప్రేమతో పాటు బాధ్యతను కూడా గుర్తుచేసే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో చేసే అల్లరి, తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కలిసి చేసే హంగామా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా స్కూల్ సీక్వెన్స్‌లు సహజంగా ఉండి నవ్వులు పూయిస్తాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఫర్వాలేదనిపిస్తుంది.
సెకండ్ హాఫ్ నుంచి కథ కాస్త సీరియస్‌గా మారుతుంది. ఇక్కడే దర్శకుడు అసలైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను రంగరించాడు. తల్లి అనారోగ్యం పాలైనప్పుడు హీరోలో వచ్చే మార్పు, అలాగే తండ్రీకొడుకుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని చాలా హృద్యంగా ఆవిష్కరించారు. మధ్యలో కొన్ని సీన్స్ ఊహకు తగినట్లుగా సాగడం సినిమాకు కొంత మైనస్ అనిపించినా, క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంటుంది.
సినిమాలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, కథను చెప్పిన విధానం బాగుంది. ముఖ్యంగా యువత తమ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో చెబుతూ, తల్లిదండ్రుల విలువ ఏంటో తెలియజేసేలా ఈ చిత్రం రూపొందింది. కమర్షియల్ హంగుల కంటే సహజత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ సినిమాకి బలంగా నిలిచింది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
నటుడిగా కెన్ కరుణాస్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఒకవైపు అమాయకపు ప్రేమికుడిగా కనిపిస్తూనే, మరోవైపు ఎమోషనల్ సీన్లలో పరిణతి చెందిన నటనను కనబరిచాడు. హీరోయిన్ అనిష్మ అనిల్ కుమార్ తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది. మీనాక్షి దినేష్, ప్రియాన్షీ యాదవ్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. హీరో తల్లిదండ్రులుగా నటించిన సూరజ్ వెంజరమూడు, దేవదర్శిని ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. వారి నటన కథకు ప్రాణం పోసింది.
కెన్ కరుణాస్ దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు చదువు కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అనే పాయింట్ ను తీసుకొని.. ఎంటర్టైనింగ్ గా, అదే సమయంలో ఎమోషనల్ గానూ సినిమాను తెరకెక్కించాడు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్‌మెంట్
ఎమోషన్స్
మైనస్ పాయింట్స్:
కథలో కొత్తదనం లేకపోవడం
కొన్ని రొటీన్ సీన్స్
ఫైనల్ గా చెప్పాలంటే...
'యూత్'కి కనెక్ట్ అయ్యే ఒక సింపుల్ అండ్ ఎమోషనల్ జర్నీ.
రేటింగ్: 2.75/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.






