శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమాలో హీరో ఎవరో తెలుసా?
on May 30, 2023
'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4 గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని జూన్ 2 న, ఉదయం 11:39 కి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది.
'కొత్త బంగారు లోకం'(2008) అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(2013) రూపంలో మరో ఘన విజయాన్ని అందుకున్న ఆయన.. దాని తర్వాత చేసిన 'ముకుంద'(2014) తోనూ పరవాలేదు అనిపించుకున్నారు. అనంతరం 'బ్రహ్మోత్సవం'(2016) రూపంలో ఘోర పరాజయం ఎదురుకావడంతో, కొత్త సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. 2021 లో అడ్డాల డైరెక్ట్ చేసిన 'నారప్ప' రీమేక్ ఫిల్మ్ కావడం, పైగా నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ఆయనకు ఆ సినిమా వల్ల ఆశించినంత ప్రయోజనం చేకూరలేదు. అయితే ఇప్పుడు ఆయన స్ట్రాంగ్ బ్యాక్ తో లెక్క సరిచేయాలని చూస్తున్నారు.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ ను వదిలారు. గాయాలతో ఉన్న చేతిని చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ మెప్పిస్తోంది. అదే సమయంలో పోస్టర్ మీద 'ఇది పీకే మొదటి సినిమా' అని సూచించేలా #PK1 అని రాసుంది. తెలుగు ప్రేక్షకులకు పీకే అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు, మరి ఈ సినిమాలో నటిస్తున్న కొత్త పీకే ఎవరు? అని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈ కొత్త పీకే ఎవరో కాదు.. నిర్మాత మిర్యాల రవీందర్ బావమరిది(భార్య సోదరుడు) అని సమాచారం. ఈ విషయాన్ని జూన్ 2 న అధికారికంగా వెల్లడించనున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
