Home

»

Latest News

గరివిడి లక్ష్మి ఎవరు: బయోపిక్ తీసే అంతలా ఆమె ఏం చేసింది.?

Oct 8, 2026 5:57PM

ఆనంది టైటిల్ పాత్రలో నటించిన ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. గరివిడి లక్ష్మి సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో అసలు ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో జానపద కళలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బుర్రకథ, జానపద పాటలు ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు వినోదంతో పాటు సామాజిక చైతన్యాన్ని కూడా అందించేవి. అలాంటి కాలంలో తన గొంతుతో, తనదైన బాణీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళాకారిణి గరివిడి లక్ష్మి.

ఆమె అసలు పేరు రెడ్డి విజయలక్ష్మి. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని గెడ్డపువలస ఆమె స్వస్థలం. 1990లలో స్టేజ్‌పై జానపద పాటలు, బుర్రకథలు చెప్పడం మొదలుపెట్టిన ఆమె.. కొద్ది కాలంలోనే ఉత్తరాంధ్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆమె బుర్రకథ ప్రదర్శనలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 15 ఏళ్లలో ఏకంగా పది వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న బుర్రకథ కళారంగంలో ఒక మహిళగా ఆమె నిలదొక్కుకోవడం అంత సాధారణమైన విషయం కాదు. కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం, సామాజిక అంశాలను ప్రస్తావించడం.. ఇలా బుర్రకథలోని విభిన్న అంశాలను తనదైన శైలిలో అందించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఒక దశలో ‘గరివిడి లక్ష్మి’ అనేది కేవలం ఒక కళాకారిణి పేరు కాకుండా ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఆమెను అనుకరిస్తూ ఎన్నో ట్రూప్స్ కూడా ఏర్పడ్డాయి. ఆమె బుర్రకథలు, పాటలు ఆడియో రూపంలో కూడా విడుదలయ్యాయి. అప్పట్లో ఆమె పాడిన పలు జానపద గీతాలు యువతలో మంచి ఆదరణ పొందాయి.

గరివిడి లక్ష్మి పేరు చెప్పగానే ఇప్పటికీ చాలామందికి గుర్తొచ్చే జానపద గీతాల్లో ‘నల్ల జీలకర్ర మొగ్గ’, 'అత్తరు సాయిబో రారా' ముందు వరుసలో ఉంటాయి. ఇవి కొత్తగా వచ్చిన పాటలు  కాదు. 1990లలోనే గరివిడి లక్ష్మి బుర్రకథ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన జానపద గీతాలు.

గరివిడి లక్ష్మి జీవితం కేవలం పాటలు, బుర్రకథలతోనే ముగిసిపోలేదు. జానపద కళను వేదికగా చేసుకుని గ్రామీణ ప్రజలకు సామాజిక విషయాలను చేరవేసిన కళాకారిణిగా ఆమెకు గుర్తింపు వచ్చింది.

అయితే ఒక దశలో ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సినిమా అవకాశాలు ఇప్పిస్తామనే మాటలతో ఆమెను సంప్రదించడం, ఆ తర్వాత ఆమె జీవితం అనూహ్య మలుపు తిరగడం.. చివరికి ఆమె కనిపించకుండా పోవడం వంటి అంశాలను ఇప్పుడు వస్తున్న సినిమా కథలో కీలకంగా చూపిస్తున్నారు.

ఇదే పాయింట్ ఇప్పుడు ‘గరివిడి లక్ష్మి’ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దగా తెలియని ఈ జానపద కళాకారిణి జీవితంలో అసలు ఏం జరిగింది? ఆమె ప్రస్థానం ఎలా మొదలైంది? అంతటి పేరు తెచ్చుకున్న తర్వాత ఎందుకు కనుమరుగయ్యారు? అనే ప్రశ్నలకు సినిమాలో సమాధానం దొరకనుంది.

ఇది కూడా చదవండి: రాజమౌళి మరో అద్భుతం.. ‘వారణాసి’ కోసం కొత్త భాష.. ‘బాహుబలి’ని మించేలా ఉంటుంది.!

 

 

 

[Who is Garividi Lakshmi, Garividi Lakshmi Biography, Garividi Lakshmi Biopic, Garividi Lakshmi Real Story, Garividi Lakshmi Movie, Garividi Lakshmi, Anandhi, Telugu Film News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com