ఫస్ట్ టైమ్ ఊహను చూసి "ఓర్నీయబ్బా.. ఏంది ఇంత లావుందీ" అనుకున్న శ్రీకాంత్!
on Jun 14, 2021
హీరోగా శ్రీకాంత్ ఇండస్ట్రీలో నిలదొక్కుకొనేందుకు ప్రయత్నిస్తున్న రోజులవి. ఈవీవీ సత్యనారాయణ 'ఆమె' మూవీని ప్లాన్ చేసి, హీరోయిన్గా ఊహ అనే కొత్తమ్మాయిని ఎంచుకున్నారు. ఆమె అసలు పేరు ఉమామహేశ్వరి. అంతకు ముందు నాలుగేళ్ల క్రితమే 'హృదయ సామ్రాజ్య' అనే కన్నడ సినిమాతో పరిచయమై, తర్వాత తమిళంలో బిజీ ఆర్టిస్ట్ అయిన ఊహ, నాలుగేళ్ల తర్వాత 'ఆమె'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయినా, నటించడానికి సరే అన్నాడు శ్రీకాంత్. హీరోయిన్ క్యారెక్టర్‌ను ఎవరు చేస్తారనేది ఆ సినిమా ఒప్పుకొనేటప్పుడు శ్రీకాంత్‌కు తెలీదు. "ఓపెనింగ్ రోజు ఆమెను చూశాను. ఓర్నీయబ్బా ఏంది ఇంత లావుందీ అనుకున్నా." అని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ నవ్వేశాడు శ్రీకాంత్. అయితే ఆమె బ్లూ ఐస్ నచ్చాయని చెప్పాడు.
హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి రమ్యకృష్ణ లాంటి పెద్ద హీరోయిన్ను ఎవరినైనా పెడతారేమో, తనకూ హెల్ప్ అవుతుందని అనుకున్నాడు శ్రీకాంత్. అయితే 'ఆమె'కు ఊహే మెయిన్ ఎట్రాక్షన్ అయ్యారు. తెలుగులో తొలి సినిమాతోటే ఉత్తమనటిగా నంది అవార్డును అందుకున్నారు. ఆ సినిమాతో అయిన పరిచయం శ్రీకాంత్, ఊహ మధ్య క్రమేపీ సన్నిహితత్వాన్ని పెంచింది. ఇద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. స్నేహం కాస్తా ప్రేమగా మారింది.
"ఊహను మా ఇంటికి పిలిచేవాడ్ని. మా ఇంట్లో ఫంక్షన్స్ అన్నింటికీ తను అటెండ్ అయ్యేది. అలా తనను మెల్లగా మా ఇంట్లోవాళ్లకు అలవాటు చేశాను. వాళ్ల అమ్మానాన్నలు కూడా వచ్చేవారు. అలా ఊహను పడేశాను. మా ఇద్దరి ఇళ్లల్లోని పెద్దలు ఒప్పుకున్నారు. అలా 1997 జనవరి 20న మా పెళ్లయిపోయింది." అని వెల్లడించాడు శ్రీకాంత్. ఆ ఇద్దరి అనురాగానికి చిహ్నంగా రోషన్, రోహన్ అనే ఇద్దరు కొడుకులు, మేధ అనే కూతురు పుట్టారు. తండ్రి బాటలో నటుడైన పెద్ద కొడుకు రోషన్ టీనేజ్‌లో ఉండగా 'నిర్మలా కాన్వెంట్'లో మెయిన్ రోల్ చేసి, త్వరలో హీరోగా 'పెళ్లి సందD'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.