అందుకే నేను ఆ సినిమా చేయలేదు.. 'బేబీ' వివాదంపై విశ్వక్ సేన్ రియాక్షన్!
on Jul 27, 2023

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో 'హృదయ కాలేయం' ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన 'బేబీ' చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ సక్సెస్ మీట్ లో దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ, ఒక హీరో కనీసం తన కథ వినడానికి కూడా ఇష్టపడలేదని చెప్పాడు. ఈ క్రమంలో 'వద్దు అంటే వద్దు అనే అర్థం' అంటూ విశ్వక్ సేన్ పరోక్షంగా ట్వీట్ చేయడంతో ఆ హీరో తనే అని అందరికీ అర్థమైంది. దీంతో కొందరు విశ్వక్ సేన్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అంత ఆటిట్యూడ్ అవసరమా అని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా జరిగిన 'పేకమేడలు' మూవీ టీజర్ లాంచ్ వేడుకకు విశ్వక్ సేన్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, కథ కూడా వినకుండా బేబీ సినిమాని రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని వివరించాడు. "పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా వాళ్ల స్థాయి సినిమాలతో బిజీగా ఉంటూనే ఉంటారు. అలాగే కొన్ని సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టి, ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఇతరుల టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటాం. కథ విన్న తర్వాత ఇప్పుడు చేయలేనని చెప్పడం కంటే, ముందే చేయనని చెప్పడం మంచిదనే ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది. దానిని తప్పుగా అర్థం చేసుకోవడం సరికాదు. మన సినిమా బాగుంటే గర్వంగా తల ఎత్తుకోవడంతో తప్పులేదు, కానీ ఎదుటివారిని కించపరచడం సరికాదు. ఒక చిన్న సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందంటే నాకు కూడా ఆనందమే. అసలు ఆ మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అందరికంటే ముందు విష్ చేసింది నేను. టాలీవుడ్ డైరెక్టర్స్ కి ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఉంది. అందులో నేను కూడా ఉన్నాను. నేనే ముందు విష్ చేశాను. నేను అందరి సినిమాలు ఆడాలని కోరుకుంటాను" అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



