ENGLISH | TELUGU  

ఈ తరం ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందాలి!

on Jul 3, 2023

తెలుగు జాతికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని ఎన్టీఆర్ శకపురుషుడని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

ఎన్టీఆర్ శతాబ్ది సందర్భంగా, ఎన్టీఆర్ శాసనసభ ప్రసంగాలు, ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలతోపాటు శకపురషుడు ప్రత్యేక సంచికపై సమాలోచను ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ ఆదివారం రోజు నిర్వహించింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయేంద్రప్రసాద్ ఎన్టీఆర్ సినిమా, రాజకీయ జీవితంపై వెలువరించిన శకపురుషుడు ఆయన ప్రసంగాల పుస్తకాలను ఈ తరం తప్పకుండా చదవాలని ఎన్టీఆర్ నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు.

లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారని, ముఖ్యమంత్రిగా అలాంటి వారు ప్రపంచంలోనే గొప్ప అరుదుగా ఉంటారని ఆయన అన్నారు. ఆయన ఏది అనుకుంటే అది సాధించిన దాకా నిద్రపోరని 40 సంవత్సరాల క్రితమే ప్రతిపక్షాలను ఐఖ్యం చేసిన ఘనత ఎన్టీఆర్ ది అని చెప్పారు. కమిటీ వెలువరించిన ఈ మూడు గ్రంథాలు ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేస్తాయని ఈ గ్రంథాలు ప్రజలందరికి చేరాలని తాను కోరుకుంటున్నాని ఆయన చెప్పారు.

డా. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తనకు దైవంతో సమానమని ఆయనతో పనిచేసే అవకాశం అదృష్టం కలిగాయని, ఆయన శతాబ్ది సందర్భంగా కమిటీ వెలువరించిన మూడు గ్రంథాలలో శకపురుషుడు అత్యున్నతమైనది, అలాంటి గ్రంథాన్ని ఈ తరం పాఠకులకు అందించినందుకు కమిటీని అభినందిస్తున్నాని, శకపురుషుడు ప్రతి ఇంటిలో ఉండదగ్గ పుస్తకమని ఆయన చెప్పారు.

సుమన్ మాట్లాడుతూ.. ఎన్.టి.ఆర్. ఆయనతో నటించే అవకాశం కలగకపోయినా ఆయనను మూడు సార్లు కలిశామని, ఆయన ఎంతో ఆప్యాయంగా తనను ఆదరించి, మాట్లాడటం జీవితంలో మరచిపోలేనని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశించినప్పుడు స్ఫూర్తి పొంది విరాళంగా లక్ష రూపాయలను ఇచ్చిన ఆనందం నాకు మధుర స్మృతిగా మిగిలిపోయిందని అన్నారు.

దర్శకుడు బి. గోపాల్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను దూరంగా చూస్తేనే జీవితం ధన్యమైపోతుందనుకున్న రోజులున్నాయని అలాంటిది అడవి రాముడు సినిమా షూటింగ్ అప్పుడు ఆయన పక్కనే నిలబడి క్లాప్ కొట్టే అవకాశం వచ్చినప్పుడు జీవితంలో ఇంతకంటే ఈ తృప్తి, ఈ ఆనందం చాలు అని అనుకున్నానని ఆయన నిజంగా దైవాంశ సంభూతుడని అన్నారు.

నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. నాన్నగారి శతాబ్ది ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరగటం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని కలగజేశాయని, అన్న బాలకృష్ణ, నా వివాహం తిరుపతిలో జరిగినప్పుడు నాన్నగారు స్వయంగా రాలేదని బాధపడ్డా ఆయన ప్రజల కోసం ప్రచారంలో ఉన్నాడని తెలిసి గర్వపడ్డామని చెప్పారు. నాన్నగారి కృషి, పట్టుదల మాకు వారసత్వంగా వచ్చాయని రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

కమిటీ చైర్మన్ టి.డి. జనార్ధన్ మాట్లాడుతూ.. అన్నగారి శతాబ్ది సంవత్సరంలో వారికి నివాళిగా ఏదైనా చేయాలనే సంకల్పంతో ఒక కమిటీగా ఏర్పాటయ్యామని, అన్నగారి శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు పుస్తకాలు తీసుకు రావటానికి ఎనిమిది నెలలు అవిశ్రాంతంగా శ్రమించామని కమిటీ సభ్యులంతా నిబద్ధతతో పనిచేశారని ఇప్పుడు ఆ పుస్తకాలను అందరూ ప్రసంసిస్తుంటే తమకెంతో సంతోషంగాను, సంతృప్తిగాను ఉందని జనార్థన్ తెలిపారు.

అన్నగారి వంద అడుగుల విగ్రహాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టించాలనే సంకల్పంతో ఈ కమిటీ పనిచేస్తుందని ఈ కమిటీని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.

ఈ సభలో కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, దొప్పలపూడి రామ్ మోహన రావు, డి. మధుసూదన రాజు, మండవ సతీష్, శ్రీపతి సతీష్, కాట్రగడ్డ ప్రసాద్, విక్రమ్ పూల తదితరులు పాల్గొన్నారు. ఈ సభను సీనియర్ జర్నలిస్ట్, కమిటీ సభ్యుడు భగీరథ సమర్థవంతంగా నిర్వహించారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.