తమిళ్ బిగ్ బాస్ సీజన్ 10 హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విజయ్ సేతుపతి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. హౌస్‌లోని ఓ కంటెస్టెంట్‌ను ఉద్దేశించి ఆయన చేసిన 'లీడర్‌షిప్' వ్యాఖ్యలు, దళపతి విజయ్‌పై విసిరిన పరోక్ష సెటైర్లేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
సరికొత్త ఫార్మాట్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ తమిళ 10వ సీజన్ వీకెండ్ ఎపిసోడ్‌లో విజయ్ సేతుపతి, హౌస్ కెప్టెన్‌గా విఫలమైన కంటెస్టెంట్‌ను నిలదీశారు. నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతూ.. "ఆలోచించకుండా హామీలు గుప్పించడం, అసలు సమస్యలు, బాధ్యతలు ఎదురైనప్పుడు ఎదుటి జట్టుపై నెట్టేసి పారిపోవడం లీడర్‌షిప్ అనిపించుకోదు. కేవలం ఉపన్యాసాలు దంచడమే నాయకత్వం కాదు, అది ప్రజలను ఏమార్చడమే అవుతుంది" అంటూ గట్టిగానే క్లాస్ పీకారు.
విజయ్ సేతుపతి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన దళపతి విజయ్‌ను ఉద్దేశించే సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ అభిమానులు, పొలిటికల్ సపోర్టర్లు ఆయనపై మండిపడుతున్నారు. ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, విజయ్ సేతుపతి కావాలనే పరోక్షంగా పొలిటికల్ టాపిక్ తీసుకొచ్చారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వాస్తవానికి విజయ్ సేతుపతి, దళపతి విజయ్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్టర్' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనూ వేదికలపై విజయ్ సేతుపతి.. విజయ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో సేతుపతి మద్దతుదారులు స్పందిస్తూ.. ఇది కేవలం బిగ్ బాస్ హౌస్ గేమ్‌కు సంబంధించిన సంభాషణ మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు విజయ్ టీవీ యాజమాన్యం కూడా స్పందిస్తూ, బిగ్ బాస్ షోలో జరిగే చర్చలు కేవలం హౌస్ పరిస్థితులకు పరిమితమైనవని, ఏ వ్యక్తిని గానీ, భావజాలాన్ని గానీ ఉద్దేశించినవి కాదని వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
[Vijay Sethupathi Bigg Boss Tamil 10, Thalapathy Vijay Sethupathi Controversy, Vijay Sethupathi Leadership Speech Bigg Boss, Master Movie Vijay Sethupathi Vijay, Tamil Bigg Boss Season 10 Latest News]




.webp)

