'అమిగోస్' వదులుకొని ఆ ఫ్లాప్ సినిమా చేసిన రౌడీ స్టార్!
on Feb 7, 2023
నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ పోషించిన మూవీ 'అమిగోస్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకుడు. ఈ నెల 10న విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే అసలు ఈ కథ ముందుగా విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళినట్లు తెలుస్తోంది.
విజయ్ తో మైత్రి మేకర్స్ 'డియర్ కామ్రేడ్' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. 2019లో విడుదలైన ఈ చిత్రం పరవాలేదు అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. నిజానికి విజయ్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు 'డియర్ కామ్రేడ్'తో పాటు 'అమిగోస్' కథని కూడా వినిపించిందట మైత్రి. అయితే విజయ్ మాత్రం 'డియర్ కామ్రేడ్' కథకి ఓటేసినట్లు తెలుస్తోంది. అలా 'అమిగోస్' కథను వదులుకొని 'డియర్ కామ్రేడ్'తో ఫ్లాప్ అందుకున్నాడన్నమాట.
విజయ్ తర్వాత కూడా మైత్రి ఒకరిద్దరు హీరోలను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే చివరిగా కళ్యాణ్ రామ్ దగ్గరకు ఈ కథ వెళ్లగా.. ఆయన వెంటనే ఓకే చేసినట్లు సమాచారం. కొత్త కథలను, కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటాడు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో ఈ శుక్రవారం తేలిపోనుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
