ఫ్యామిలీ మ్యాన్ కావాలనుకుంటున్న రౌడీ హీరో!
on Mar 18, 2020
వరుసగా రెండో ఏడాది హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్‌గా ఎంపికై, మహేశ్ తర్వాత ఆ ఫీట్ సాధించిన రెండో టాలీవుడ్ స్టార్‌గా నిలిచాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రేమ గురించీ, బ్యాచిలర్ లైఫ్ గురించీ మాట్లాడాడు.
"ఫ్యామిలీ మ్యాన్‌గా ఉండటానికి ప్రాధాన్యం ఇస్తారా? లేక బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తారా?" అనడిగిన ప్రశ్నకు, "నేను బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తాను. కానీ నేను ఫ్యామిలీ మ్యాన్‌ను కావాలనుకొనే రోజు వస్తుందని నాకు తెలుసు" అని అతను తెలిపాడు. తాను ప్రతిదీ కావాలనుకుంటాననీ, అలాగే ఫ్యామిలీ మ్యాన్‌ని కూడా కావాలనుకుంటాననీ అతనన్నాడు. "మన సొంతవాళ్లను, మన పిల్లలను కలిగివుండటం, వాళ్లు ఎదుగుతుంటే చూడ్డం చాలా బాగుంటుంది" అని చెప్పాడు విజయ్.
పర్‌ఫెక్ట్ డేట్‌పై అతని ఆలోచన గురించి అడిగితే, "నేను డేట్స్ చేయను. రొమాన్స్ విషయంలో నేనంత పెద్దవాడ్ని కాను. మనం నిజంగా ఇష్టపడే సరైన వ్యక్తితో ఉండటం పర్ఫెక్ట్ డేటింగ్ అనేది నా అభిప్రాయం" అనేది విజయ్ జవాబు.
"అలాంటి ఇష్టమైన వ్యక్తి మీకు తారసపడ్డారా?" అని ప్రశ్నిస్తే, "నో కామెంట్స్. ఒకవేళ నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నా కూడా కచ్చితంగా దాన్ని సీక్రెట్‌గా ఉంచుతా. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాలి. ఇందులో వేరే వాళ్ల ప్రమేయం అవసరం లేదు. మా అమ్మానాన్నలకు, ఫ్రెండ్స్‌కు ఈ విషయం చెప్తా. ఏదో ఒకరోజు బయటి ప్రపంచానికి చెప్పాలనుకున్నప్పుడు చెప్తా. కానీ దానికి సమయం పడుతుంది. నా జీవితం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని నేను కోరుకోను" అని ఖరాఖండీగా చెప్పాడు విజయ్. ప్రస్తుతం అతను పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
