ENGLISH | TELUGU  

న‌వ‌త‌రం సూప‌ర్‌స్టార్స్‌!

on Jun 6, 2020

 

టాలీవుడ్‌లో న‌వ‌త‌రం ప‌ర‌వ‌ళ్లు తొక్కుతోంది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత మంది హీరోలు ఇవాళ క‌నిపిస్తున్నారు. వీరంతా ఆకాశ‌మే హ‌ద్దుగా ముందుగా సాగాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ త‌రం త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్‌బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ టాప్ స్టార్స్ రేంజిని ఆస్వాదిస్తూ వ‌స్తున్నారు. అయితే గ‌త ఐదారేళ్లుగా న‌వ‌త‌రానికి ప్ర‌తినిధులుగా కొంత‌మంది హీరోలు క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు. వీళ్లు శ‌ర‌వేగంగా వెండితెర‌పైకి దూసుకువ‌చ్చి మెగా, సూప‌ర్‌స్టార్ల‌కు ధీటుగా పోటీ ఇస్తున్నారు. వీరి ఉత్తేజం, ఉత్సాహం చూసి ప్రేక్ష‌కులు నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు.

ఈ కొత్త త‌రానికి వరుణ్ తేజ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విష్వ‌క్‌సేన్ ప్ర‌తినిధులుగా క‌నిపిస్తున్నారు. ఇర‌వై నుంచి ప‌దేళ్ల క్రితం ముందు వ‌ర‌కూ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి టాప్ స్టార్ల‌యిన వాళ్లంద‌రూ న‌ట వార‌సులే కావ‌డం గ‌మ‌నార్హం. నాని స్వ‌యంకృషితో ఎదిగినా టాప్ స్టార్ రేంజికి చేరుకోలేక‌పోయాడు. నితిన్‌, శ‌ర్వానంద్‌, రామ్ వంటి వాళ్లు కూడా ఒక స్థాయికి వ‌చ్చి నిలిచిపోయారే కానీ మాస్ స్టార్స్ కాలేక‌పోయారు. 'ఇస్మార్ట్ శంక‌ర్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత రామ్‌లో కొత్త ఉత్సాహం, ఉత్తేజం క‌నిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో అత‌ను ఈ త‌ర‌హా మిర‌కిల్స్ సాధించినా టాప్ స్టార్ రేంజిని అందుకుంటాడ‌నేది సందేహ‌మే.

కాగా ముందు త‌రానికీ, ఈ త‌రానికీ స్ప‌ష్ట‌మైన తేడా ఒక‌టి క‌నిపిస్తోంది. గ‌తంలో స్టార్ల సినిమాల‌కు మినిమ‌మ్ గ్యారంటీ ఉండేది. క్రేజీ కాంబినేష‌న్‌, ఇమేజ్ వాళ్ల‌కు వెన్నుద‌న్నుగా నిలిచాయి. వాళ్ల సినిమాల‌కు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ల‌భించేది. క‌థ‌, క‌థ‌నాల విష‌యాల్లో పెద్ద‌గా ప‌ట్టింపు లేక‌పోయిన‌ప్ప‌టికీ క్రేజీ కాంబినేష‌న్స్‌, ఫార్ములా వారి విజ‌యాల‌కు బాస‌ట‌గా నిలిచాయి. ఐదారు ఫ్లాపుల త‌ర్వాత ఒక మంచి సినిమా వ‌చ్చినా ప్రేక్ష‌కులు వారికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేవారు. ఆ స్టార్ల కెరీర్‌కు బ్రేక్ ఉండేది కాదు. ఇప్ప‌డా సీన్ మారిపోయింది. ఇప్పుడు ఒక్క ఫ్లాప్‌ను కూడా యువ‌త‌రం హీరోలు త‌ట్టుకోవ‌డానికి సిద్ధంగా లేరు. అందుకే వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ అంగీక‌రించ‌కుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట చిన్న చిన్న పాత్ర‌లు చేసిన అత‌ను 'పెళ్లిచూపులు' పేరుతో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని హీరోగా తొలి హిట్ సాధించ‌డ‌మే కాకుండా, అంద‌రూ ఎవ‌రీ కుర్రాడు అని త‌న‌వేపు చూసేలా చేసుకున్నాడు. అది 'అర్జున్‌రెడ్డి' సినిమాకు ప‌నికొచ్చింది. ఆ సినిమా సృష్టించిన సెన్సేష‌న్ ఎలాంటిదో మ‌నం చూశాం. ఆ మూవీతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజ‌య్‌. 'గీత గోవిందం' మూవీ అత‌డిని యూత్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ స‌న్నిహితం చేసింది. 'డియ‌ర్ కామ్రేడ్' సినిమాకు ఆ మాత్రం క‌లెక్ష‌న్లు వ‌చ్చాయంటే అత‌ని క‌రిష్మానే కార‌ణం. 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్' థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్ అయ్యింది. కార‌ణం.. స్టార్‌గా ఇప్పుడు అత‌ను సాధించిన ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లుగా కంటెంట్ లేక‌పోవ‌డం. అయిన‌ప్ప‌టికీ నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డం విశేషం. ఇది అత‌ని క్రేజ్‌కు నిద‌ర్శ‌నం. ఇప్పుడ‌త‌ను డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ రూపొందిస్తోన్న మూవీలో బాక్స‌ర్‌గా న‌టిస్తున్నాడు. 'లైగ‌ర్' అనే టైటిల్ రిజిస్ట‌ర్ చేసిన ఈ మూవీతో మాస్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వాల‌ని విజ‌య్ భావిస్తున్నాడు. ఈ సినిమా హిట్ట‌యితే నెక్ట్స్ జ‌న‌రేష‌న్ సూప‌ర్‌స్టార్ రేసులో అత‌ను ముందుంటాడ‌నేది ఖాయం.

న‌ట వార‌సుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాగ‌బాబు కుమారుడు వ‌రుణ్‌తేజ్.. విశ్లేష‌కులను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్ప‌టికే ఫాద‌ర్ ఫెయిలైన చోట హీరోగా స‌క్సెస్ అయిన వ‌రుణ్‌.. 'కంచె' మూవీ నుంచి ముంద‌డుగులు వేస్తూ పోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ‌, ఎఫ్‌2, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాల‌తో భ‌విష్య‌త్ సూప‌ర్ స్టార్ అయ్యే ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్నాడు. 'ఎఫ్‌2'లో కామెడీ టైమింగ్‌, తెలంగాణ యాస డైలాగ్ డిక్ష‌న్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక 'గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్' సినిమాలో అయితే మిడిల్ ఏజ్డ్ మ్యాన్‌గా, క్రూరుడిగా వ‌య‌సుకు మించిన ప‌ర్ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించి శ‌భాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడ‌త‌ను కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్ సినిమాలో బాక్స‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో వ‌రుణ్‌ టాప్ స్టార్ రేసులో ఇంకో అడుగు ముందుకేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

అతి స్వ‌ల్ప కాలంలో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకొని, త‌న యారొగెంట్ యాటిట్యూడ్‌తో వివాస్ప‌దుడిగా పేరు తెచ్చుకున్న హీరో విష్వ‌క్‌సేన్‌. సొంతంగా 'ఫ‌ల‌క్‌నుమా దాస్' అనే చిన్న సినిమా చేసి, విజ‌యం అందుకున్న విష్వ‌క్‌.. ఆ సినిమా విడుద‌ల విష‌యంలో ఎదుర్కొన్న ప్ర‌తికూల‌త‌ల‌కు విసిగి ఇండ‌స్ట్రీలోని కొంత‌మందిపై చేసిన కామెంట్స్ సంచ‌ల‌నాన్నీ, వివాదాన్నీ సృష్టించాయి. ఫైర్‌బ్రాండ్‌గా ముద్ర‌ప‌డేలా చేశాయి. ఇక ఈమ‌ధ్య విడుద‌లైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ 'హిట్‌'తో అత‌ను ప్రేక్ష‌కుల్ని మ‌రింత ఆక‌ట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో స్టార్ హీరో కావ‌డానికి కావాల్సిన అర్హ‌త‌లు ఉన్నాయ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించాడు.

వీళ్ల‌తో పాటే సినిమాల్లో అడుగుపెట్టి స్టార్ స్టేట‌స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు సాయిధ‌ర‌మ్ తేజ్‌, బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, అఖిల్‌, కార్తికేయ వంటి హీరోలు. అంద‌గాడిగా పేరున్నా, ఘ‌న‌మైన న‌ట వార‌సత్వం ఉన్నా అఖిల్ అక్కినేని అభిమానుల ఆశ‌ల్ని ఇంత‌వ‌ర‌కూ నిల‌బెట్ట‌లేక‌పోయాడు. చేసిన మూడు సినిమాలు.. అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను.. హిట్‌కు అడుగు దూరంలో నిలిచిపోయాయి. 'ఆర్ఎక్స్ 100'తో సంచ‌ల‌నం సృష్టించిన‌ప్ప‌టికీ, ఆ త‌ర్వాత వ‌చ్చిన మూడు సినిమాల‌తోనూ నిరుత్సాహ‌ప‌రిచాడు కార్తికేయ‌. 'రాక్ష‌సుడు' మూవీతో కెరీర్‌లో తొలి హిట్ అందుకొని, ఆశ‌గా అడుగులేస్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. వ‌రుస ఫ్లాపుల‌తో ఉక్కిరిబిక్కిరై 'చిత్ర‌ల‌హ‌రి', 'ప్ర‌తిరోజూ పండ‌గే' సినిమాల‌తో ఊపిరి పీల్చుకున్నాడు సాయితేజ్‌. రానున్న రోజుల్లో వీళ్ల‌లో ఎవ‌రైనా టాప్ స్టార్ రేంజికి ఎద‌గ‌వ‌చ్చు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.