
విజయ్ దేవరకొండ మరోసారి తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై స్పందించాడు. తన సినిమాలను టార్గెట్ చేస్తూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించాడు. ఒకే సమయంలో ఒకే రకమైన రీల్స్‌ను పలు అకౌంట్లలో షేర్ చేయడం వెనుక ఏదో వ్యవహారం ఉందని వ్యాఖ్యానించాడు. అసలు తనపై, తన సినిమాలపై ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏడేళ్లు పట్టిందని విజయ్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘రణబాలి’. ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాల దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అక్టోబర్ 16న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
తనపై, తన సినిమాలపై కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని విజయ్ ఆరోపించాడు. ఇది కేవలం విద్వేషం మాత్రమే కాదని, కొన్ని గ్రూపులు ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నాయని చెప్పాడు. ఇందుకు ఉదాహరణగా ఒకే రకమైన రీల్‌ను పలు అకౌంట్లలో ఒకేసారి షేర్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించాడు.
‘తెలుగు సినిమా రణబాలికి వెళ్లకుండా జైలర్ 2కి వెళ్దాం’ అనే తరహా సందేశంతో ఒకే రీల్‌ను పలు అకౌంట్లలో షేర్ చేస్తున్నారని విజయ్ తెలిపాడు. ఇలా ఒకే సమయంలో ఒకే కంటెంట్ ప్రచారం అవుతుంటే, దాని వెనుక ఎవరైనా ఉండి డబ్బులు ఖర్చు చేస్తున్నారేమోనని తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు.
తనపై, తన సినిమాలపై జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడానికి ఏడేళ్లు పట్టిందని విజయ్ చెప్పాడు. గతేడాది ఈ వ్యవహారంపై తనకు స్పష్టత వచ్చిందని వెల్లడించాడు.
ఇక తనను విమర్శించే వారి గురించి కూడా విజయ్ ఘాటుగా స్పందించాడు. తన కలలు, తన కష్టం ఇతరులకు అనవసరంగా అనిపిస్తే తాను ఆగిపోవాలా? తన నిజాయతీని అహంకారంగా భావిస్తే నటించడం మానేయాలా? తనపై తనకున్న నమ్మకాన్ని బలుపుగా చూస్తే తాను ఎందుకు తగ్గాలని ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలతో తనను విమర్శించే వారికి గట్టిగానే సమాధానం ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ
[Vijay Deverakonda On Negative Trolls, Ranabaali Trailer Launch, Vijay Deverakonda Comments, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Film News]




.webp)

