Home

»

Latest News

కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ

Oct 9, 2026 3:08AM

నటీనటులు: శ్రీ విష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, సుదర్శన్, షైన్ టామ్ చాకో, సత్య.

 

సాంకేతిక వర్గం:

రచన: జానకిరామ్ మారెళ్ల, భాను భోగవరపు, నందు సవిరిగాన

సంగీతం: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

ఎడిటింగ్: చోటా కె ప్రసాద్

దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల

నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి

సమర్పణ: కోన వెంకట్

 

శ్రీ విష్ణు తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్న ఆయన, ఇప్పుడు కామ్రేడ్ కళ్యాణ్ (Comrade Kalyan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

కథ:

కళ్యాణ్ (Sree Vishnu) తన ఊరిలో ఒక పాత థియేటర్‌ను నడుపుతుంటాడు. ఆ ఊరిలో కమ్యూనిజం ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ఆర్. నారాయణమూర్తి సినిమాలు ఆడిస్తూ డబ్బులు సంపాదించాలని చూస్తాడు. మరోవైపు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ (Shine Tom Chacko) నక్సలైట్ల కోసం తీవ్రంగా గాలిస్తుంటాడు. ఈ క్రమంలో ఒరియా అమ్మాయి సితార (Mahima Nambiar)తో కళ్యాణ్ ప్రేమలో పడతాడు.

మరోపక్క, తన తల్లి (Radhikaa) చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుంటూ కళ్యాణ్‌కు సమస్యలు తెచ్చిపెడుతుంటుంది. జీవితంలో ఎదగాలంటే దుబాయ్ బాబు (Satya) వల్లే అవుతుందని కళ్యాణ్ నమ్ముతాడు. అయితే, తన అన్నయ్య చేసిన అప్పుల వల్ల ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని సితార చెబుతుంది. ఆమె అప్పు తాను తీర్చాలని అనుకున్న కళ్యాణ్, ఊహించని విధంగా కామ్రేడ్ కళ్యాణ్ గా మారుతాడు. ఎందుకు? ఆ తర్వాత ఏమైంది? అన్నది మిగతా కథ.

 

విశ్లేషణ:

శ్రీ విష్ణు తన పాత్రకు న్యాయం చేయడానికి ప్రయత్నించినా, స్క్రిప్ట్ లో పెద్దగా బలం లేదు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా రొటీన్ గా అనిపిస్తుంది. కొత్తదనం కోసం ఆయన తన పాత శైలి నుంచి బయటకు రావాలి. కొన్ని సన్నివేశాల్లో మహిమా నంబియార్ నటన పర్వాలేదనిపించినా, ఆమె మేకప్ అంతగా సెట్ కాలేదు.

రాధికా శరత్‌కుమార్, సుదర్శన్ పాత్రలను సరిగ్గా వాడుకోలేదు. సత్య, వెన్నెల కిషోర్ నవ్వించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. షైన్ టామ్ చాకో నటన అతిగా అనిపిస్తుంది. రచయితలు భాను, నందు గతంలో మంచి కథలు, మాటలు అందించినా, ఈ సినిమా లో వారు ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. 

విజయ్ బుల్గానిన్ పాటలు బాగున్నాయి, కానీ నేపథ్య సంగీతం ఇంకా మెరుగ్గా ఉండొచ్చు. కథ, స్క్రీన్‌ప్లే 80ల నాటి సినిమాలను గుర్తుచేస్తాయి. 2026లో ఉన్న ప్రేక్షకులకు ఈ కథ ఎలా ఉండబోతుందో ముందే అర్థమైపోతుంది. కామెడీ వర్కౌట్ కాలేదు, రొటీన్ డైలాగులతో ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది.

దర్శకుడు జానకిరామ్ (Janakiram Marella) తన విజన్‌ను తెరపై చూపించడానికి కష్టపడినా, సినిమా వేగాన్ని సరిగ్గా నడిపించలేకపోయాడు. పాతకాలం నాటి కథనం చాలా చోట్ల విసుగు తెప్పిస్తుంది. అయితే, సినిమా రన్‌టైమ్ తక్కువగా ఉండటం, నిర్మాణ విలువలు బాగుండటం కాస్త కలిసొచ్చే అంశం. పాత కథ అయినా పర్వాలేదు అనుకునే వారు ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.

 

ప్లస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాల్లో శ్రీ విష్ణు టైమింగ్

దుబాయ్ షేక్ పాత్రలో సత్య

పాటలు

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

నెమ్మదిగా సాగే కథనం

మెరుపులు లేని స్క్రీన్‌ప్లే

ఆకట్టుకోని డైలాగులు

రొటీన్‌గా అనిపించే శ్రీ విష్ణు మ్యానరిజమ్స్

 

చివరి గా: పాత కథ అంతే పాత కథనం వెరసి నీరసం!! 

 

రేటింగ్: 2.25/5

 

గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com