‘కింగ్డమ్’ టార్గెట్ ఏమిటి.. బిజినెస్‌పరంగా ఎలాంటి ఫిగర్స్ వచ్చాయి?
on Jul 28, 2025
రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. గత కొంతకాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా హిట్ అనేది అతని దరి చేరడం లేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ముందున్న ఒకే ఒక్క ఆశాకిరణం ‘కింగ్డమ్’. ఈ సినిమాపై బోలెడన్న ఆశలు పెట్టుకున్నాడు. అలాగే అతని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. జూలై 31న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పాన్ ఇండియా మూవీతో విజయ్ దేవరకొండ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమన్న అభిప్రాయం ఎంతో మందిలో ఉంది.
విజయ్ దేవరకొండకు సరిగ్గా రెండు వారాల టైమ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైమ్ ఒక సినిమాకి రావడం చాలా అరుదు. దాదాపు 15 రోజులు ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టగలిగితే విజయ్ దేవరకొండ గట్టెక్కినట్టే. ఆగస్ట్ 14న సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కూలీ’, ఎన్టీఆర్, హృతిక్‌రోషన్‌ల ‘వార్2’ విడుదల కాబోతున్నాయి. కాబట్టి ‘కింగ్డమ్’ని చూసేందుకు ప్రేక్షకుల్ని ఎలర్ట్ చెయ్యగలిగితే విజయ్ దేవరకొండ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయం. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. సినిమాలో ఏదో సమ్‌థింగ్ ఉందనే భావన ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉంది. ట్రైలర్ చూస్తుంటే విజయ్ దేవరకొండ ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. ఆ కారణంగా థియేటర్లకి ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం చాలా ఉంది.
‘కింగ్డమ్’ సినిమా ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కలెక్షన్ల పరంగా 100 కోట్ల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు ‘కింగ్డమ్’ నిర్మాతలు. అది సాధించేందుకు ప్రమోషన్లపరంగా రకరకరాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ గురించి చెప్పాలంటే.. ఓవర్సీస్‌లో ఒకటిన్నర మిలియన్ వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అలాగే ఆంధ్ర 15 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, నైజాం 15 కోట్లు, ఇతర రాష్ట్రాలు 4 కోట్లు, ఇతర భాషల్లో డబ్బింగ్ ద్వారా 4 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం. సినిమాకి బ్లాక్‌బస్టర్ అనే టాక్ వస్తేనే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాపై ఉన్న బజ్ చూస్తుంటే ఆ లక్ష్యాన్ని ఛేదించే ఛాన్స్ ఉంది.
ఇక టికెట్స్ రేట్ల పెంపు, ప్రీమియర్స్ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. అలాగే ప్రీమియర్స్‌కి కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే ప్రీమియర్స్ వేసే ఆలోచన ‘కింగ్డమ్’ మేకర్స్‌కి లేదని తెలుస్తోంది. అలా వేయడం వల్ల సినిమా టాక్ ముందు రోజే స్ప్రెడ్ అయిపోతోందని, దానివల్ల సినిమాకి నష్టం జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే రిలీజ్ రోజు మొదటి షోకి వచ్చే టాక్ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతోనైనా విజయ్ దేవరకొండ భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



