'హత్య' మూవీ రివ్యూ.. 'బిచ్చగాడు' హీరోకి కలిసిరాలేదు!
on Jul 21, 2023

తమిళ హీరో విజయ్ ఆంటోని 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బిచ్చగాడు' ఇచ్చిన ఉత్సాహంతో అప్పటినుంచి తమిళ్ తో పాటు తెలుగులోనూ తన సినిమాలను విడుదల చేస్తూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అయితే 'బిచ్చగాడు' తర్వాత అతనికి ఆస్థాయి విజయం దక్కలేదు. ఈ ఏడాది మేలో విడుదలైన 'బిచ్చగాడు-2'నే అతనికి కాస్త ఊరటనిచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ విన్నర్ గా నిలవడమే కాకుండా, తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రాబట్టడం విశేషం. 'బిచ్చగాడు-2' వచ్చిన రెండు నెలలకే 'హత్య'(తమిళ్ లో 'కొలై') అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్.
'హత్య' సినిమా మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్. ఫేమస్ మోడల్ లైలా (మీనాక్షీ చౌదరి) తన ఫ్లాట్ లో హత్యకు గురవుతుంది. ఆ కేసును కొత్తగా డ్యూటీలో చేరిన ఐపీఎస్ సంధ్య(రితికా సింగ్)కి అప్పగిస్తారు. ఆమె ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోనీ) సహాయం కోరుతుంది. అసలు మోడల్ లైలాను హత్య చేసింది ఎవరు? సంధ్య, వినాయక్ కలిసి నేరస్థులను ఎలా పట్టుకోగలిగారు? అనేది మిగిలిన కథ.
మర్డర్ మిస్టరీ సినిమాలు కొత్త కాదు. ఈ సినిమాలకు కథనమే ప్రధానం. కథనంలో ఊహించని మలుపులు ఉండాలి. ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగాలి. అసలు ఆ హత్య చేసింది ఎవరో చివరివరకు ప్రేక్షకుల ఊహకి అందకూడదు. కానీ ఈ విషయంలో హత్య సినిమా నిరాశపరిచింది. నేరస్థుడు ఎవరనేది ప్రేక్షకుల ఊహకు అందేలా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అంత ఆసక్తికరంగా ఏం సాగదు. నెమ్మదిగా సాగే కథనం, హీరో కూతురి సెంటిమెంట్ సీన్లు కథకి స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడి, ప్రేక్షకులను సినిమాలో లీనం కాకుండా చేశాయి. హీరో గొప్ప డిటెక్టివ్ అని మాటల రూపంలో వినిపించడమే గానీ, తెర మీద అతని తెలివితేటలు మనకు కనిపించవు. మొత్తానికి కొత్తదనం లేని కథ, నెమ్మదిగా సాగే కథనంతో 'హత్య' సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



