Home

»

Latest News

ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనే: ఆ ఒక్క హీరోతోనే ఏకంగా 40 సినిమాలు

Sep 29, 2026 12:53PM

 

 

'స్విమ్ సూట్'.. సినిమాలో హీరోయిన్ ధరించే స్విమ్ సూట్ ని ప్రేక్షకులని ఎట్రాక్  చేయడం కోసమని  చాలా మంది అనుకుంటారు గాని, కథ, కథనంకి తగట్టుగా హీరోయిన్ చేత స్విమ్ సూట్ షాట్ వేస్తే ఆమె క్యారక్టర్ తీరు తెన్నులతో ప్రేక్షకులు ట్రావెల్ అవుతుంటారు. మనకి తెలియకుండానే సినిమాతో  ట్రావెల్ అయ్యే  స్క్రీన్ ప్లే జిమ్మిక్క్. దాంతో సినిమా మొత్తానికి మంచి జరుగుతుంది. మరి ఈ స్విమ్ సూట్ విషయంలో సౌత్ లోనే ఫస్ట్ అటెంప్ట్ చేసిన నటి జయంతి గారని మీకు తెలుసా? 


భారతీయ సినీ యవనికపై తనదైన ముద్ర వేసి, ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత నటి 'అభినయ శారద' జయంతి. 1945 జనవరి 6న కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన ఆమె అసలు పేరు కమలా కుమారి. చిన్నతనంలోనే తండ్రి బాలసుబ్రహ్మణ్యం, తల్లి సంతానలక్ష్మి వేరుపడటంతో కుటుంబంతో సహా చెన్నైకి చేరుకున్నారు. నృత్యంపై ఉన్న తీవ్ర ఆసక్తితో డ్యాన్స్ స్కూల్‌లో చేరిన జయంతికి, అక్కడ తమిళ ప్రముఖ నటి మనోరమ సహాధ్యాయిగా పరిచయమయ్యారు. నటన, నాట్యం నేర్చుకునే ఆరంభ రోజుల్లో కొందరు ఆమె లావుగా ఉందంటూ హేళన చేసినా, అధైర్యపడకుండా తీవ్రంగా శ్రమించి తన ప్రతిభతోనే సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నారు. 


అభినయంలో అద్భుత రసాలను పండించే సత్తా ఉన్న జయంతిని వై. ఆర్. స్వామి గుర్తించి, 1963లో 'జేను గూడు' అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం చేశారు. ఆ చిత్రంతోనే వై.ఆర్. స్వామి ఆమె పేరును 'జయంతి'గా మార్చారు.   తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ మరియు మరాఠీ భాషల్లో కలిపి మొత్తం 500 కి పైగా చిత్రాలలో నటించి దక్షిణ భారత చిత్రసీమలో అగ్ర కథానాయికగా జయంతి వెలిగిపోయారు. కన్నడ ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు రాజ్‌కుమార్‌తో ఏకంగా 30 కి పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డు సృష్టించారు. 

తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'జగదేకవీరుని కథ' చిత్ర సెట్స్‌ను సందర్శించినప్పుడు చిన్నారి కమలా కుమారిని ఎన్టీఆర్ తన ఒడిలో కూర్చోబెట్టుకుని సరదాగా "భవిష్యత్తులో నా కథానాయికవి అవుతావా?" అని అడిగారట. ఆ మాట నిజమవుతూ ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ సరసన 'జగదేకవీరుని కథ', 'కులగౌరవం', 'కొండవీటి సింహం', 'జస్టిస్ చౌదరి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఆమె మెరిశారు. అలాగే శోభన్ బాబు, కృష్ణంరాజు, అక్కినేని నాగేశ్వరరావు వంటి మహానటుల సరసన కూడా వైవిధ్యమైన పాత్రలను పోషించి మెప్పించారు. 1965లో వచ్చిన 'మిస్ లీలవతి' చిత్రంలో ఆధునిక తరహా పాత్రలో నటించి సంచలనం సృష్టించారు.   అప్పట్లోనే స్విమ్‌సూట్, మోడరన్ దుస్తులు ధరించి సరికొత్త గ్లామర్ శకాన్ని ప్రారంభించిన మొదటి కన్నడ నటిగా ఆమె రికార్డులకెక్కారు. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పతకం లభించగా, నాటి సమాచార ప్రసారాల శాఖ మంత్రి ఇందిరా గాంధీ స్వయంగా జయంతిని ముద్దాడి అభినందించడం విశేషం. 

ఇది కూడా చదవండి: 'సంబరాల ఏటిగట్టు' కథ లీక్ అయ్యింది: ఇది ఆ మెగా ప్రొడ్యూసర్ పనేనా!

 


ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో 'ఇరు కోడుగల్', 'బామా విజయం', 'ఎదిర్ నీచ్చల్', 'పున్నగై' వంటి అనేక గొప్ప సామాజిక సినిమాలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.   తన నటనకు గాను అత్యుత్తమ నటిగా 4 సార్లు, ఉత్తమ సహాయ నటిగా 2 సార్లు సహా మొత్తం 7 సార్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ చలనచిత్ర పురస్కారాలను జయంతి గెలుచుకున్నారు. దాంతోపాటు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులను రెండుసార్లు ('ఎడకల్లు గుడ్డద మేలే', 'తులసి' సినిమాలకు) కైవసం చేసుకున్నారు. కన్నడ పరిశ్రమ ఆమెకు 'అభినయ శారద' అనే బిరుదుతో సత్కరించింది. 


అప్పటికే పెళ్ళైన  ప్రముఖ నటుడు, దర్శకుడు పేకేటి శివరామ్‌ని  వివాహం చేసుకున్న జయంతి ఆ తర్వాత విడిపోయారు.  చివరి శ్వాస వరకు సినీ రంగానికే అంకితమయ్యి . జూలై 26, 2021న తన 76వ ఏట కన్నుమూశారు. మూసింది కన్నే కానీ. కళాకారిణిగా నిత్యం అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో నిత్య స్పర్శ గా ఉంటూనే ఉన్నారు.

 

[Veteran Actress Jayanthi Biography Life Story, Actress Jayanthi Biography,swim suit, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com