'సీఐ మురళి'గా వేణు తొట్టెంపూడి
on Jul 6, 2022
'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'హనుమాన్ జంక్షన్' వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి పదేళ్లుగా వెండితెరకు దూరమయ్యాడు. రవితేజ హీరోగా రూపొందుతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ'తో వేణు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి వేణు లుక్ ని రివీల్ చేశారు.
'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో సీఐ జమ్మి మురళి పాత్రలో వేణు కనిపించనున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. పోలీస్ యూనిఫామ్ ధరించి.. క్లీన్ షేవ్, మీసకట్టుతో ఉన్న వేణు ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంటోంది. పదేళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న వేణుకి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 2012 లో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన 'దమ్ము' మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కి బావగా వేణు కనిపించాడు. కానీ ఆ పాత్ర వేణు కెరీర్ కి ఉపయోగపడలేదు. మరి ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ'తోనైనా ట్రాక్ లో పడతాడేమో చూద్దాం.
శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.