కశ్మీర్లో షూటింగ్ కోసం 4 మైళ్లు నడిచిన వెంకటేశ్!
on Dec 11, 2019
నిజ జీవితంలో మాదిరిగానే వెంకటేశ్, నాగచైతన్య మేనమామ, మేనల్లుళ్లుగా నటించిన 'వెంకీమామా' మూవీ డిసెంబర్ 13న విడుదలవుతోంది. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ దర్శకుడు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్లను కశ్మీర్‌లోని గడ్డకట్టించే మంచులో చిత్రీకరించారు. అక్కడి షూటింగ్ కోసం యూనిట్ ఎంత కష్టపడిందో బాబీ వివరించారు. అలాగే కశ్మీర్ అంటే సాధారణంగా మనలో ఉన్న అభిప్రాయానికి భిన్నంగా అక్కడి వాతావరణం ఉందని ఆయన తెలిపారు. ఆయన ఏమన్నారంటే...
"క్లైమాక్స్‌ను కశ్మీర్లో చిత్రీకరించాం. సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కు ఎంత ప్రాముఖ్యం ఉందో, ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌కు కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుంది. నిజానికి కశ్మీర్లో షూటింగ్‌కు ఇబ్బందులు కలుగుతాయేమోననే ఉద్దేశంతో కులుమనాలి, కోడైకెనాల్‌లో రెక్కీ చేసి, కశ్మీర్ బ్యాక్‌డ్రాప్ సీన్లను అక్కడ తీద్దామని ఫిక్సయిపోయాం. పైగా మనం రోజూ కశ్మీర్ గురించి వేరే రకంగా వింటున్నాం. 'రోజా' సినిమాలో ఉన్న తరహాలో అక్కడ భయానక వాతావరణం ఉంటుందని భావిస్తున్నాం. రోడ్ల మీదే ఎన్కౌంటర్లు జరుగుతుంటాయని వింటున్నాం. అయితే ఒకరోజు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల గారు వేరే పనిపై కశ్మీర్ వెళ్లి అక్కడి లోకెషన్స్ను తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసి తీసుకొచ్చారు. దాంతో నేను కశ్మీరే కావాలని మా నిర్మాతల్ని మారాం చేస్తూ వచ్చాను. ఆ తర్వాత సురేశ్‌బాబు గారు, వివేక్ గారు, సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెళ్ల, నేను కశ్మీర్ వెళ్లాం. మనం వింటున్న దానికి పూర్తి భిన్నంగా అక్కడ వాతావరణం కనిపించింది. ఎలాంటి గొడవలూ అక్కడ లేవు. అక్కడున్న మిలటరీ వాళ్లు షూటింగ్‌కు బాగా సపోర్ట్ చేశారు. అక్కడి ముస్లింలు చాలా మర్యాదగా నడచుకుంటున్నారు. కశ్మీరీలతో పోల్చుకుంటే మనం మహా ముదుర్లం అనిపించింది. వాళ్లు చాలా అమాయకంగా బతికేస్తున్నారనిపించింది. కశ్మీర్ అంటే అల్లర్లు అనే ఇమేజ్‌కు భిన్నమైన వాతావరణమే మేం చూశాం. మేం అక్కడి గ్లేసియర్ ప్రాంతానికి వెళ్లి షూటింగ్ చెయ్యాలి. అక్కడ 365 రోజులూ మంచు పడుతూనే ఉంటుంది. అక్కడికి వెళ్లాలంటే 4 కిలో మీటర్లు గుర్రాలపై వెళ్లి, అక్కడ్నుంచి మరో 4 కిలోమీటర్లు నడచుకుంటూ వెళ్లాలి. అక్కడ షూటింగ్ జరిగినన్ని రోజులూ వెంకటేశ్ గారితో సహా యూనిట్ మెంబర్స్ అందరమూ సామాన్లు మోసుకుంటూ గుర్రమెక్కి, ఎక్కడ పడిపోతామేమోనని దాన్ని గట్టిగా పట్టుకొని, 4 కిలోమీటర్లు వెళ్లి, అక్కడ్నుంచి నడుచుకుంటూ మా షూటింగ్ లొకేషన్‌కు వెళ్తూ వచ్చాం. ఇదంతా ఒకెత్తయితే మోకాళ్ల లోతు మంచులో షూట్ చెయ్యాలి. సురేశ్‌బాబు గారు మా వెనుకవుండి నడిపించడం వల్ల 20 రోజుల పాటు కశ్మీర్లో మంచి మంచి లొకేషన్లలో షూటింగ్ చేశాం."