
"అసలు నేను వీరప్పన్ జీవితం గురించి చెప్పినడానికి.. ఆ విషయాలను వర్మ తెరకెక్కించినదానికి అస్సలు సంబంధం లేదు, "విల్లాది విలన్ వీరప్పన్"గా తమిళంలో విడుదలకానున్న వీరప్పన్ పై చిత్రీకరించిన సినిమాను వెంటనే బ్యాన్ చేయాలి" అంటూ మీడియా సాక్షిగా వర్మపై విరుచుకుపడింది వీరప్పన్ సతీమణి ముత్తు లక్ష్మీ.
మొదట కన్నడలో రూపొంది, అనంతరం తెలుగులో అనువాద రూపంలో విడుదలైన "వీరప్పన్" సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. దాంతో.. ఆ సినిమాను హిందీలోనూ తీసేశాడు వర్మ. కన్నడ, తెలుగు స్థాయిలో హిందీలో ఆ సినిమా ఆడలేదనుకోండి. ఇప్పుడా సినిమాను "విల్లాది విలన్ వీరప్పన్" అనే పేరుతో తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు వర్మ. కన్నడ మినహా మరో భాషలో సినిమా తెరకెక్కిస్తున్న విషయమే తనకు చెప్పలేదని, ఇప్పుడు ఏకంగా తమిళంలో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మీ పేర్కొంది. అసత్యాల కలగంపగా తెరకెక్కిన ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాట విడుదలకానివ్వనని ముత్తు లక్ష్మీ భీషించుకొని కూర్చోందట. మరి వర్మ ఈ విషయమై ఎలా స్పందిస్తాడా? అని అందరూ ఎదురుచూస్తున్నారు!







