సినిమా ఇంత ప్రేమ ఇస్తుందా?!: వరుణ్ తేజ్
on Sep 28, 2019
"సినిమా డబ్బు, పేరు ఇస్తుంది అని విన్నాం.. కానీ ఇంత ప్రేమ ఇస్తుందని ఇలా మీ అందర్నీ చూస్తుంటే అనిపిస్తోంది. మీ అభిమానం చూస్తుంటే ఎంత చేసిన తక్కువే అనిపిస్తుంది. మీ అభిమానం కోసం నా శాయశక్తుల ప్రయత్నిస్తాను" అని ఎమోషనల్ అయ్యాడు వరుణ్ తేజ్. వైజాగ్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన 'గద్దలకొండ గణేష్' విజయోత్సవ సభకు వచ్చిన అభిమాన సందోహాన్ని చూసి వరుణ్ నోటి నుంచి వచ్చిన మాటలివి.
ఆయన మాట్లాడుతూ "మా 'గద్దల కొండ గణేష్' సినిమాకు మంచి అప్రిసియేషన్ రావడం వల్ల సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. విజయవాడలో స్టార్ట్ చేశాం. ఈరోజు వైజాగ్‌తో టూర్ ముగిస్తున్నాం. సినిమాని నాకు పరిచయం చేసింది వైజాగ్. నేను నటనలో శిక్షణ తీసుకుంది కూడా ఇక్కడే. మా గురువు సత్యానంద్ గారి దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ విధంగా సినిమా వల్ల నాకు, వైజాగ్‌కి గొప్ప అనుబంధం ఏర్పడింది. మీ అందరూ సినిమాను ప్రేమించినంత కాలం మేము మంచి సినిమాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం.. డైరెక్టర్ హరీశ్ శంకర్.. బాబాయ్‌కి 'గబ్బర్ సింగ్'తో ఎంత మంచి సినిమా ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అంత పెద్దది కాకపోయినా నాకు 'గద్దల కొండ గణేష్' ఇచ్చారు. ఈ సినిమాతో అధర్వ నాకు మరో బ్రదర్ అయ్యారు. ఐనాంక బోస్ విజువల్స్ చాలా బాగున్నాయి. పూజ నా ఫస్ట్ హీరోయిన్. మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట, గోపి ఆచంట ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండి చాలా కష్టాలు పడ్డాం. కొన్ని సార్లు షూటింగ్ ఆపేశారు. రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా ఒక మంచి సినిమా మీకివ్వాలనే సంకల్పం మమల్ని ముందుకు నడిపింది. ఇంత పెద్ద హిట్ చేసినందుకు మెగా ఫ్యాన్స్‌కి, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి థాంక్స్. నేను చాలా సార్లు బాబాయ్ పేరు చెప్పగానే మీరు అరుస్తుంటే నేను స్టేజ్‌కి అటువైపు ఉండాలి కదా అనుకుంటూ ఉంటాను. నా నెక్స్ట్ సినిమా షూటింగ్ ఇక్కడే చేస్తున్నాను. త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను" అని చెప్పాడు.
ఈ వేడుకలో దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, తారలు మృణాళిని రవి, డింపుల్ హయతి, నటులు బ్రహ్మాజీ, సత్య, రచ్చ రవి పాల్గొన్నారు.