వరుణ్ తేజ్‌కి ఎంత ధైర్యం... పవన్ టైటిల్‌నే కొట్టేస్తున్నాడా?
on Sep 2, 2017
ఒక స్టార్ హీరోకి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు. సినిమా ఎలా ఉన్న మొదటి మూడు రోజులు థియేటర్లు అభిమానులతో కిటకిటలాడుతాయి. మరి యంగ్ హీరోల విషయానికి వస్తే, ప్రేక్షకుడిని థియేటర్ కి తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నం చేయాలి. తమ సినిమాలో గొప్ప కంటెంట్ ఉందని సగటు సినీ అభిమానికి అర్ధం అయ్యేలా చెప్పాలి. ఇక ఈ మధ్య కొందరు యువ హీరోలు తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మరో దారి ఎన్నుకుంటున్నారు. అదేంటంటే, స్టార్ హీరోలయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తదితరుల క్రేజ్ వాడుకోవడం. తమ చిత్రాల్లో ఏదో విధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏదో ఒక కంటెంట్ ఉండేలా చూసుకుంటున్నారు.
తద్వారా, పవన్ అభిమానుల మెప్పు పొందొచ్చు అనేది వారి ముఖ్యోద్దేశం. ఇక అసలు విషయానికి వస్తే, మెగా హీరో వరుణ్ తేజ్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న తన తదుపరి చిత్రానికి తొలి ప్రేమ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. ఆ టైం లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి క్లాసిక్ సినిమా టైటిల్ కాజేసే ధైర్యం చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ టైటిల్ సినిమా పైన బజ్ పెరగడానికి ఉపయోగపడుతుంది. కానీ, ఏ మాత్రం తేడా వచ్చినా పరిస్థితులు తల కిందులవుతాయి.