
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ విషయంలోనూ ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.290 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల విషయంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పేరు మీద రికార్డు ఉంది. ఆ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు సుమారు రూ.225 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ‘వారణాసి’ హక్కుల కోసం రూ.290 కోట్ల డీల్ కుదిరిందనే వార్త నిజమైతే.. పాత రికార్డు సుమారు రూ.65 కోట్ల తేడాతో బద్దలైనట్లే.
ఈ హక్కుల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు పోటీపడినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కూడా ఆసక్తి చూపించాయని, చివరకు మైత్రీ మూవీ మేకర్స్ ఈ డీల్‌ను దక్కించుకుందని టాక్.

ఒక సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.290 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. ఈ స్థాయి పెట్టుబడిని వెనక్కి తీసుకురావాలంటే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ట్రేడ్ అంచనాల ప్రకారం డిస్ట్రిబ్యూటర్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.500 కోట్ల గ్రాస్‌కు చేరే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. దీంతో సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
మహేశ్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తుండటంతో ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ రుద్ర పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొత్తానికి సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. బిజినెస్ విషయంలో మాత్రం ‘వారణాసి’ ఇప్పటి నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది. మరి థియేటర్లలోనూ ఈ సినిమా అదే స్థాయి సంచలనం సృష్టిస్తుందా అనేది చూడాలి.
మీకు నచ్చవచ్చు:
రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. అలా అంటారనే ఆరోజు మౌనంగా ఉన్నా.!
ఘనంగా ప్రభాస్ పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ.?
[Varanasi Telugu States Rights, Varanasi 290 Crore Deal, Varanasi Theatrical Rights, Mythri Movie Makers, RRR Movie, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Telugu Film News]





