తమిళ సినీ పరిశ్రమలో హీరోలకు ఉండే అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో స్టార్డమ్ సంపాదించుకున్న కొందరు రాజకీయాల్లోకి అడుగుపెడుతుంటే.. మరికొందరు మాత్రం తమకు నచ్చిన రంగంలోనే కొనసాగుతున్నారు. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కావడంతో సినీ అభిమానుల్లో మరోసారి ఈ అంశంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై సూర్య స్వయంగా స్పందించి తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు.
సూర్యకు సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అగరం ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమాల కారణంగానే గత కొంతకాలంగా సూర్య రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా తన సినిమా ‘సీన్’ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాజకీయ ప్రవేశంపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. అయితే రాజకీయాలను ద్వేషించడం లేదని, వాటిని నిశితంగా గమనిస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలంటే ఆ రంగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని, అందులోని బాధ్యతలు, కష్టనష్టాలను అర్థం చేసుకోవాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: పవన్కళ్యాణ్, అన్నా లెజినోవా సంచలన నిర్ణయం.. పరస్పర అంగీకారంతో విడిపోయిన జంట.!
ఇక అగరం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చేస్తున్న పనులను సేవగా పిలవనని, అది తమ బాధ్యతగా భావిస్తామని చెప్పారు. తనకు సమాజంలో గుర్తింపు, స్థానం ఇచ్చిన ప్రజలకు తిరిగి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వీటి వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పినంత మాత్రాన రాజకీయాలను ద్వేషిస్తున్నట్లు కాదని, వాటిని మౌనంగా, నిశితంగా గమనిస్తున్నానని పేర్కొన్నారు.
అంతేకాదు.. సమాజంలో మార్పు రావాలంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూర్య అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ముందుగా ఆ రంగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. సమాజంలో ఉన్న సమస్యలకు మూలం అజ్ఞానమని, దాన్ని తొలగించడానికి విద్య ఒక్కటే మార్గమని అన్నారు. అవినీతిని మూడో వ్యక్తి వచ్చి నిర్మూలించలేడని, ప్రతి ఒక్కరూ తమలో తాము మార్పు తెచ్చుకొని చిన్న చిన్న విషయాల్లోనూ అవినీతికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పారు. ఇలా రాజకీయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన సూర్య.. ప్రస్తుతం తనకు రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ఆలోచన లేదనే విషయాన్ని స్పష్టం చేశారు.
మొత్తానికి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో సూర్య కూడా అదే బాటలో నడుస్తారా? అనే చర్చకు ఆయన తాజా వ్యాఖ్యలతో సమాధానం లభించినట్లయింది. సినిమాలు చేస్తూనే అగరం ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తున్న సూర్య.. రాజకీయాల్లోకి మాత్రం ఇప్పట్లో రావడం లేదని తేల్చిచెప్పారు.
మీకు నచ్చవచ్చు: రామాయణాన్ని వెనక్కి నెట్టిన స్మాల్ మూవీ: సంచలన కలెక్షన్స్.!
[Suriya Political Entry, Suriya Politics News, Suriya Latest News, Suriya Vijay Politics, Actor Suriya Political Statement, Suriya Agaram Foundation, Suriya Social Service, Suriya Political Career, Suriya Scene Movie, Tamil Cinema News, Thalapathy Vijay Politics]






