ENGLISH | TELUGU  

చిత్రపురి కాలనీపై వస్తున్న ఆరోపణలకు అధ్యక్షుడు వల్లభనేని వివరణ!

on Jul 25, 2025

 

హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలతో కూడిన వ్యాఖ్యలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై మాట్లాడడం జరిగింది. 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "సాధారణంగా చిత్రపురి కాలనీలో ఆరు నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో అందరం ఒక కుటుంబ సభ్యులులాగా కూర్చుని మాట్లాడుకుని మాకు ఉన్న సమస్యల గురించి చర్చించుకుంటాము. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ సమావేశంలో మాట్లాడకుండా చలో ఫిలిం ఛాంబర్, చలో గాంధీభవన్ అంటూ బయటికి వస్తున్నారు. వారిలో అసలు చిత్రపురి కాలనీకి సంబంధం లేని వారు కూడా ఉండటం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, అలాగే కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. ఈ కారణంగా కాలనీలో ఉండే ఎంతోమంది భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే చిత్రపురి కాలనీ ఎన్నో సమస్యలలో ఉంది. ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఒక కుటుంబం లాగా అందరం కలిసి ముందుకు వెళ్తున్నాము. అవినీతి జరిగింది అంటూ మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడేవారు వారి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని వస్తే బహిరంగంగా మాట్లాడేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసాము. కాని ఎవరు రాలేదు. అంతేకానీ ఈ సమావేశం వ్యక్తిగతమైనది కాదు. చిత్రపురి కాలనీలో 4713 కుటుంబాలు ఇప్పటికే నివాసం ఉంటున్నారు. 700 నుండి 850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీ పై సుమారు 3000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు. ఆరోపణలు చేసే వారితో బహిరంగంగా మాట్లాడేందుకు ఈరోజు లైవ్ పెట్టి మరి మీడియా సమక్షంలో మాట్లాడేందుకు ఈ సమావేశానికి రావడం జరిగింది. కోర్టులో ఉన్న కొన్ని విషయాలపై నేను మాట్లాడలేను కాని మిగతా వాటిపై నేను మాట్లాడతాను " అంటూ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 

 

* చిత్రపురి కాలనీలో జాయిన్ కావాలంటే కచ్చితంగా సినీ కార్మికులయ్యే ఉండాలి. ప్రస్తుతానికి సుమారు 60 శాతం మాత్రమే అలా ఉన్నారు. కొంతమంది అమ్ముకుని బయటకు వెళ్లిపోయారు. 

* 2009లోనే పర్మిషన్లు తీసుకుని రో హౌసులు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 2017లో కూడా మరికొన్ని పర్మిషన్లతో G+2గా మరి కొన్ని రో హౌసులు నిర్మించడం జరిగింది. అవి అన్ని పెర్మిషన్ తోనే జరిగాయి కాని కొంతమంది కేసులు పెట్టిన కారణంగా ఆ కట్టడాలు ఆపడం జరిగింది. 

* ఇప్పటికీ ఉన్న రేట్లు అన్ని సమావేశంలో చర్చించుకుని ఫిక్స్ చేసినవే. అలాగే కాలనీ పై ఉన్న అప్పును దృష్టిలో పెట్టుకొని ఆ రేట్లు నిర్ణయించడం జరిగింది. సఫైర్ సూట్ నిర్మించేందుకు అన్ని పర్మిషన్లతోనే ముందుకు వెళ్తున్నాము. 

* శ్రావణమాసంలో కొత్త నిర్మాణాలు మొదలుపెట్టనున్నాము. చుట్టుపక్కల ఉన్న ఎన్నో గేటెడ్ కమ్యూనిటీలకు తగ్గట్లు అన్ని రకాల ఎమినిటీస్ తో సఫైర్ సూట్ నిర్మించబోతున్నాము. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తి కాకపోతే కాలనీ మనుగడకే సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా పర్మిషన్లు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. దానిని పూర్తి చేసి ఉన్న సమస్యలు అన్నిటిని సాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాము. మొత్తం 51 అంతస్థుల భవనంలో సఫైర్ సూట్ ప్లాన్ చేస్తున్నాము. 

* చిత్రపురి కాలనీలో నీటి సమస్య అనేదే లేదు. నిరంతరం మంజీరా నీటి సరఫరా ఉంటుంది. 

* కాలనీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ సరైన మెంబర్షిప్ లు ఉంటే కచ్చితంగా వారికి ఫ్లాట్ వచ్చేందుకు మా కమిటీ పూర్తి సహకారం అందించి వారికి ఫ్లాట్ వచ్చేలా పనిచేస్తుంది. వారికి ఫ్లాట్లు ఇచ్చేందుకు కూడా రెడీ గానే ఉన్నాయి. 

* వచ్చే సెప్టెంబర్ నెలలో జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఆరోపణలు చేసేవారు వివరణ ఇవ్వాలి. ఆ వివరణ ఆధారంగా చర్యలు ఉండబోతాయి. 

* ఇప్పటికీ చిత్రపురి కాలనీ పై ఉన్న సుమారు 170 కోట్ల రూపాయల అప్పును తీర్చాలంటే సఫైర్ సూట్ కేవలం 48 నెలలలో పూర్తిచేస్తే ఆ అప్పును తీర్చే అవకాశం ఉంది. అంతేకానీ కాలనీలోని సభ్యులపై ఆ అప్పు పడదు. 

* 2023 తర్వాత ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఒకవేళ అలా చేసిన 336లో సినీ కార్మికులు కాని వారు ఎవరైనా ఉంటే వారిని తీసేయడానికి అనిల్ కుమార్ కమిటీ సపోర్ట్ చేస్తుంది. 

* సినీ జర్నలిస్టులకు కూడా చిత్రపురిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా సినీ జర్నలిస్టులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అలాగే 24 క్రాఫ్ట్స్ లో తమ అసోసియేషన్ ద్వారా వస్తే ఫ్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము. 

* గతంలో లోన్స్ కట్టలేని పరిస్థితులలో ఆక్షన్ వేసే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో చదలవాడ శ్రీనివాస్ గారు చిత్రపురి కాలనీకి అండగా నిలబడ్డారు. 

* ప్రభుత్వం వారు ఇప్పటికే వేసిన కమిటీ వారు ఎవరైనా సినీ కార్మికులకు న్యాయంగా ఫ్లాట్ వెళుతుంది అని చెప్తే కచ్చితంగా వారికి ఫ్లాట్ ఇస్తాము. 

* సభ్యులను తీయాలంటే రెండు ప్రక్రియలు మాత్రమే ఉంటాయి. ఒకటి సరైన సమయంలో డబ్బులు కట్టకపోవడం వల్ల తీసేస్తాము. లేదా సినీ కార్మికులు కాని వారిని తీసేస్తాము. ఈ రెండు కారణాలు కాకుండా సభ్యులను తీసేసే అవకాశం ఎవరికీ లేదు. 

ఈ కార్యక్రమంలో చిత్రపురి కాలనీకి సంబంధించిన సెక్రటరీ దొరై, కమిటీ మెంబర్లు లలిత, రామకృష్ణ, రఘు, లహరి తదితరులు పాల్గొన్నారు.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.