పవన్ ని సీఎం అనేసిన ఐటమ్ గాళ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు, ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!
on Jul 28, 2023

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఏకంగా ముఖ్యమంత్రిని చేసేసింది ఓ ఐటమ్ గాళ్. తను తెలిసి చేసిందో, తెలియక చేసిందో గానీ.. ఈ ట్వీట్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. 'సీఎం పవన్' అనే సౌండ్ వినగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే.. "ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేదా" అంటూ నెటిజన్స్ అమ్మడిని ఆడేసుకుంటున్నారు.
దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోని "బాస్ పార్టీ" అనే ఐటమ్ సాంగ్ తో గ్లామర్ ప్రియులను విశేషంగా ఆకర్షించింది ఊర్వశీ రౌటేలా. కట్ చేస్తే.. తాజాగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'బ్రో'లోనూ ఓ స్పెషల్ పబ్ సాంగ్ లో మెరిసింది. శుక్రవారం (జూలై 28) 'బ్రో' రిలీజ్ అవుతున్న సందర్భంగా గురువారం రాత్రి ఊర్వశి ఓ ట్వీట్ చేసింది. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో 'బ్రో' సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరణానంతరం తన తప్పులను సరిదిద్దుకోవడానికి ఓ దురంహకారికి ఇవ్వబడిన రెండో అవకాశం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది" అంటూ రాసుకొచ్చింది. దీంతో.. ఈ ట్వీట్ కాస్త వైరల్ అయింది.

"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి" అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. ఇంకొంతమంది "సీఎంతోనే ఆగిపోయావెందుకు.. అతనికి ప్రధాన మంత్రి పదవి కూడా ఇచ్చేయ్" అంటూ కౌంటర్ వేస్తున్నారు. మొత్తమ్మీద.. ఊర్వశి రౌటేలా తన ట్వీట్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇప్పటికీ తను చేసిన పొరపాటును గుర్తించని ఊర్వశి.. ఆ ట్వీట్ సందేశాన్ని అలాగే ఉంచింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



