తెలుగు సినిమాపై అంత 'ఏడు'పు ఎందుకు?
on Aug 10, 2019
వెనకటికి 'కింద పడ్డా నాదే పైచేయి' అన్నాడట ఒకడు. నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన క్షణాల వ్యవధిలో తమిళ సినిమా జర్నలిస్టులు, కొందరు అభిమానులు సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ చూస్తే మొదటి లైనులో చెప్పిన సామెత గుర్తుకు వస్తుంది. తమిళ సినిమా ఇండస్ట్రీ కంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నేషనల్ అవార్డులు ఎక్కువ రావడంతో వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినిమాల గొప్పతనాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. లాబీయింగ్ చేయడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ అవార్డులు వచ్చాయని పోస్టులు పెడుతున్నారు. తమిళ సినిమాలకు తక్కువ అవార్డులు వచ్చినా... తమది ఏదో గొప్ప ఇండస్ట్రీ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. తమ అక్కసు అంతా సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు. తెలుగు సినిమాలకు ఏడు నేషనల్ అవార్డులు రావడంతో వారికి 'ఏడు'పు ఒక్కటే తక్కువ.
కళ్లున్న కబోధికి ఏం చూపించగలం? మలయాళ అమ్మాయి కీర్తి సురేష్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి'లో సావిత్రి పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించింది. ప్రేమ, కోపం, దుఃఖం, వినోదం.. నవరసాలు పలికించే పాత్ర. తమిళ సినిమా ఇండస్ట్రీ ఏం ఇచ్చింది? 2018లో 'సర్కార్', 'పందెం కోడి' వంటి కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన ఆడిపాడే పాత్రలు ఇచ్చింది. కీర్తి సురేష్ కి తెలుగు ఇండస్ట్రీ కమర్షియల్ సినిమా అవకాశాలు ఇవ్వలేదని కాదు. కానీ, 'మహానటి' వంటి అద్భుత చిత్రాన్ని, అందులో నటనను తమిళులు గుర్తించాలి కదా?
నెక్స్ట్... 'అ!'లో విజువల్స్ ఎఫెక్ట్స్, ఆ సినిమాలో మేకప్ కి నేషనల్ అవార్డులు వచ్చాయి. కామెంట్స్ చేసే తమిళులు 'అ!' చూశారో? లేదో? అందులో తమిళ అమ్మాయి రెజీనా గెటప్ చూశారో? లేదో? అందులో రెజీనా హెయిర్ స్టయిల్, ఆమె ఒంటిపై టాటూలు చూస్తే లాబీయింగ్ అనే మాటలు అనరు. తెలుగు ఇండస్ట్రీలో రెజీనాకు 2018లో 'అ!'లో డ్రగ్ ఎడిక్ట్ లా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఇస్తే... తమిళ ఇండస్ట్రీ ఎటువంటి పాత్ర ఇచ్చింది? 'మిస్టర్ చంద్రమౌళి'లో బీచ్ లో బికినీ వేసుకుని అందాలు ఆరబోసే పాత్ర. తెలుగులోనూ రెజీనా కమర్షియల్ సినిమాలు చేశారు. కాదనడం లేదు. కానీ, తెలుగు ఇండస్ట్రీ ఆమెకు మంచి పాత్ర ఇచ్చిన విషయాన్ని మరుగున పడేలా కామెంట్స్ చేస్తే ఎలా? సమంజసం కాదు. అదే 'అ!'లో తమిళ నటి దేవదర్శిని చక్కటి పాత్ర చేశారు. ఆమె మేకప్ కూడా బాగుంటుంది.
తమిళ సినిమాలకు ఎక్కువ అవార్డులు వచ్చినప్పుడు సంతోషపడి, తెలుగు సినిమాలకు వచ్చినప్పుడు లాబీయింగ్ అనే పదాలు వాడేస్తే ఎలా? అంటే... గతంలో తమిళ సినిమా ఇండస్ట్రీ లాబీయింగ్ చేసిందని అర్థమా? పాపం... ఈ చిన్న లాజిక్ ఎలా మరచిపోతున్నారో? కామెంట్స్ చేసినవాళ్లకు తెలుగు సినిమా అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.