‘బుక్ మై షో’ ఆట ముగిసింది.. ఆగడాలకు అడ్డుకట్ట వేయనున్న టాలీవుడ్!
on Mar 17, 2025
ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్లే దిక్కు. మరో ప్రత్యామ్నాయం ఆరోజుల్లో లేదు. అలాగే థియేటర్‌కి వెళ్లి టికెట్ తీసుకుంటే తప్ప సినిమా చూసే అవకాశం లేదు. రోజులు మారుతున్న కొద్దీ సినిమాల తీరు తెన్నులు మారాయి. వాటితోపాటే ప్రేక్షకులు సినిమాలు చూసే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. వాటిని సులభతరం చేసేందుకు బుక్ మై షో వంటి టికెట్ బుకింగ్ యాప్స్ రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఎక్కువగా చలామణి అవుతున్న సంస్థ బుక్ మై షో. టాలీవుడ్‌లోని లెక్కల ప్రకారం.. నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ కంటే బుక్ మై షో ఎక్కువ సంపాదిస్తోందని తెలుస్తోంది. రకరకాలుగా పెట్టుబడులు పెట్టడం ద్వారా, అడ్వాన్సులు ఇవ్వడం ద్వారా థియేటర్లను తమ కంట్రోల్‌లో ఉంచుకుంటోంది. అలాగే టికెట్ రేట్లను కూడా ఫిక్స్ చేసి భారీగా ఆదాయం పొందుతోంది. సినీ పరిశ్రమపైనే ఆధార పడి డబ్బు సంపాదిస్తూ రిలీజ్ అయిన సినిమాల మీద బాట్ రివ్యూలు పెడుతున్నారు. అంతేకాదు, సినిమాలకు సంబంధించిన యాడ్స్ ద్వారా కూడా డబ్బు సంపాదిస్తుండడంతో బుక్ మై షో వ్యవహార శైలిపై చిత్ర నిర్మాతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
చిత్ర నిర్మాతల గిల్డ్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. టికెట్స్ కొనుగోలు చేసిన వారి రివ్యూలు పెడితే ఫర్వాలేదు. అలా కాకుండా బాట్ రివ్యూలు పెట్టడం అనేది సరైంది కాదని గిల్డ్ అభిప్రాయపడుతోంది. అంతేకాదు, యాడ్స్ ఇచ్చిన వారి సినిమాలకు సంబంధించిన రివ్యూలు పాజిటివ్‌గా పెట్టడం, లేని వాటి గురించి బ్యాడ్‌గా రివ్యూ ఇవ్వడం అనేది చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోందని గిల్డ్ చెబుతోంది. తాము నిర్మించిన సినిమాల ద్వారానే వ్యాపారం చేస్తూ ఇలా ప్రవర్తించడం సమర్థించే విషయం కాదని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొత్తగా డిస్ట్రిక్ట్ సినిమా టికెట్ యాప్ తమకు అనుకూలంగా ఉందని, తాము ఎలాంటి రివ్యూలు పెట్టబోమని హామీ ఇచ్చిందని, అందువల్ల బుక్ మై షో సంస్థ తన పద్ధతి మార్చుకోకపోతే అన్ని థియేటర్లు డిస్ట్రిక్ట్ యాప్‌కు వెళ్లిపోవాలని గిల్డ్ సభ్యుల్లో అధిక శాతం సూచించినట్టు తెలుస్తోంది.
బుక్ మై షో విషయంలో కొందరు నిర్మాతలు కూడా సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే దానికి ప్రకటనలు ఇచ్చి వారు ఇచ్చే బాట్ రివ్యూలు, రేటింగ్‌లతో పబ్లిసిటీ చేసుకోవడం అనేది మొదటి నుంచీ టాలీవుడ్ నిర్మాతలకు అలవాటుగా మారింది. ఆ బలహీనతను క్యాష్ చేసుకునేందుకు బాట్ రివ్యూలు, రేటింగ్స్ ఇస్తోంది బుక్ మై షో. ప్రస్తుతం ఇది నిర్మాతలకు ఇబ్బంది కలిగించే అంశమని భావించిన గిల్డ్.. ఈ పద్ధతి మార్చుకోకపోతే డిస్ట్రిక్ట్ యాప్‌కి వెళ్ళడం తప్పదని నిర్ణయించింది. తమ సినిమాలకు మంచి రేటింగ్ రావాలని, బాగా ట్రెండ్ అవ్వాలని భావిస్తున్న నిర్మాతలు కూడా ఇకపై తమ ధోరణిని మార్చుకోవాల్సి ఉంటుంది. గిల్డ్ చెప్పినట్టుగా బుక్ మై షోను పక్కన పెడితే ఆ సంస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



