ఇంతకీ 'టైగర్ నాగేశ్వరరావు' ఎప్పుడు?
on Jan 29, 2023
మాస్ మహారాజా రవితేజ 20 రోజుల గ్యాప్ లో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ లో ధమాకా చిత్రం విడుదల అయింది. ఈ చిత్రం మాస్ మసాలా యాక్షన్ చిత్రంగా రూపొంది విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా ఘన విజయాన్ని నమోదు చేసింది. 100కోట్ల గ్రాస్ ని వసూలు చేసి రవితేజ కెరీర్ లో అతి పెద్ద హిట్ చిత్రంగా నిలిచింది. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య గా వచ్చి తన పవర్ చూపించారు. విక్రమ్ పాత్రతో సినిమాకు ఊపిరి పోసారు. ఈ రెండు చిత్రాలకు ముందు చాలా కాలంగా రవితేజకు హిట్లు లేవు. కేవలం రాజా ది గ్రేట్, క్రాక్ చిత్రాలు మాత్రమే ఆయనకు విజయాన్ని సాధించి పెట్టాయి. కానీ క్రాక్ చిత్రం తర్వాత మరల ఆయన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ లతో డిజాస్టర్స్ అందుకున్నారు. ఆ లోటును ధమాకా, వాల్తేరు వీరయ్యలు తీర్చాయి.
ప్రస్తుతం రవితేజ.. సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత వంశీకృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు అనే బయోపిక్ రూపొందుతోంది. పీరియాడికల్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా మూవీ. ఇక ఈ చిత్రంలో రేణు దేశాయ్ చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఇందులో ఓ సామాజిక కార్యకర్తగా కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ కోసం దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది దీపావళి లేదంటే క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీపావళికి విడుదల అయిందంటే బిగ్ బజ్ ఉంటుంది. అలాగే క్రిస్మస్ కూడా రవితేజకు బాగా కలిసి వచ్చింది. గత ఏడాది ఆయన క్రిస్మస్ సందర్భంగానే ధమాకా హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో ముందుగా డేట్ ఫిక్స్ చేయాలని ఓ మంచి డేట్ ను ఫిక్స్ చేసి ఇతక చిత్రాల డేట్లతో క్లాష్ లేకుండా చూసుకోవాలనేది వారి నిర్ణయంగా కనిపిస్తోంది. దాంతో మంచి రిలీజ్ డేట్ కోసం దర్శకనిర్మాతలు వెతుకుతున్నారు.
పాన్ ఇండియా చిత్రం కాబట్టి ముందుగా డేట్ ని లాక్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇతర సినిమాలకు క్లాష్ రాకుండా సోలోగా రావాలనేది వారి ఆశ. అయితే ఈ చిత్రం దీపావళి రేసులో గనుక విడుదలయితే షారుక్ ఖాన్-రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న డంకీ సినిమాతో పెద్ద ఆటంకం ఎదురు కాబోతోంది. మరి టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ విషయంలో దర్శకనిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
