2022లో కీర్తి సురేశ్ హవా!
on Oct 16, 2021
2016లో విడుదలైన `నేను శైలజ`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేరళకుట్టి కీర్తి సురేశ్. మొదటి ప్రయత్నంలోనే ఇక్కడ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆపై `నేను లోకల్`, `మహానటి`తో తెలుగునాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ టాలెంటెడ్ యాక్ట్రస్. మరీముఖ్యంగా.. అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన `మహానటి`తో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడమే కాకుండా.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రస్ గానూ నిలిచింది కీర్తి.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ఏడాదికి ఒకట్రెండు తెలుగు చిత్రాలకే పరిమితమవుతూ వస్తున్న కీర్తి.. వచ్చే సంవత్సరం ఏకంగా మూడు చిత్రాలతో తన హవా చాటుకోబోతోంది. ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ నే కావడం విశేషం. 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానున్న `సర్కారు వారి పాట`లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జోడీగా దర్శనమివ్వనున్న కీర్తి సురేశ్.. అదే ఏడాది ద్వితీయార్ధంలో రానున్న `భోళా శంకర్`లో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. అంతేకాదు.. `నేను లోకల్` తరువాత నేచురల్ స్టార్ నానికి జంటగా నటిస్తున్న `దసరా`తోనూ వచ్చే క్యాలెండర్ ఇయర్ లో ఎంటర్టైన్ చేయనుంది. మరి.. 2022లో రానున్న ఈ క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో కీర్తి స్థాయి మరింత పెరుగుతుందేమో చూడాలి.
కాగా, సూపర్ స్టార్ రజినీకాంత్ కి చెల్లెలిగా కీర్తి నటించిన `అణ్ణాత్త` దీపావళి కానుకగా ఈ నవంబర్ 4న రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమా `పెద్దన్న` పేరుతో అనువాదం కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
