30 రోజులు.. ముచ్చటగా మూడు సినిమాలే!
on Nov 29, 2023
ప్రతివారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ, అందులో విజయం సాధించేవి, నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టేవి కొన్నే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ శాతం తక్కువే ఉంటుందన్న విషయం తెలిసిందే. కానీ, ఒక్కోసారి రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ నిర్మాతలను నష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. ఏ దర్శకుడైనా, ఏ నిర్మాతైనా సినిమా హిట్ అవ్వాలి, డబ్బుతోపాటు పేరు కూడా రావాలని కోరుకుంటారు. కానీ, వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ సినిమాలు ఆశించిన విజయాన్ని అందించవు.
ఈ నవంబర్‌లో విడుదలైన సినిమాలను చూసుకుంటే 30 రోజుల్లో విడుదలైన సినిమాల్లో మూడు సినిమాలు మాత్రమే సక్సెస్ అవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కీడా కోలా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. రిలీజ్‌కి ముందు ఈ సినిమాకి ప్రమోషన్స్ ద్వారా ఎంతో హైప్ తీసుకొచ్చారు. కానీ, ప్రేక్షకులు ఈ సినిమాను తిప్పి కొట్టారు. కార్తీ హీరోగా రూపొందిన ‘జపాన్’ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కార్తీకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండడం, ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో మంచి బజ్ క్రియేట్ అయి ఉండడంతో తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది అనుకున్నారు. కానీ, ఇది కూడా బోల్తా కొట్టింది. లారెన్స్ హీరోగా వచ్చిన జిగర్తండా డబుల్ ఎక్స్ కూడా ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు అనువాద సినిమాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. ఇక వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఆదికేశవ’ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించడం కూడా ఒక కారణం. వైష్ణవ్‌కి ఈ సినిమా మంచి ప్లస్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక ఈ నవంబర్ నెల మొత్తంలో మూడు సినిమాలు మాత్రం విడుదలైన రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా కూడా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు ప్రూవ్ చేసుకున్నాయి. ఆ మూడు సినిమాలు ‘మా ఊరి పొలిమేర 2’, ‘మంగళవారం’, ‘కోట బొమ్మాళి పిఎస్’. ఈ మూడు సినిమాల్లో అజయ్‌భూపతి, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో రూపొందిన ‘మంగళవారం’ సినిమాకే ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్, రిలీజ్ అయిన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తగ్గట్టుగానే సస్పెన్స్ థ్రిల్లర్‌గా అందర్నీ ఆకట్టుకుందీ సినిమా. ‘మా ఊరి పొలిమేర 2’ చిత్రానికి అంత హైప్ క్రియేట్ అవ్వనప్పటికీ రిలీజ్ అయిన రోజునుంచే సూపర్‌హిట్ టాక్‌తో రన్ అవుతూ వచ్చింది. శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘కోట బొమ్మాళి పిఎస్’ సినిమా మలయాళ రీమేక్ అయినప్పటికీ తెలుగు వెర్షన్‌కి ఎన్నో మార్పులు చేసి మన నేటివిటీకి తగినట్టుగా రూపొందించారు. దీంతో ఈ సినిమా ఫస్ట్ షోకే సూపర్‌హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇక డిసెంబర్ నెల ‘యానిమల్’తో మొదలవుతోంది. మొదట ప్రకటించిన విధంగా ఏ సినిమాలు రిలీజ్ అవుతాయో, ఏవి పోస్ట్ పోన్ అవుతాయో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
