
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుంచి కొత్త సినిమా వస్తోందంటే చాలు, ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నుంచి వచ్చే విజువల్ వండర్, అద్భుతమైన కథాంశాన్ని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలో నోలన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 13వ చిత్రం ‘ది ఒడిస్సీ’ (The Odyssey). ఈ మూవీ విషయంలో ఇండియాలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అపూర్వమైన టికెట్ల వేట కనిపిస్తోంది.
జూలై 17న విడుదల కాబోతుండగా అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచే ఇండియాలో ప్రారంభమయ్యాయి. సాధారణంగా బాలీవుడ్ లేదా రీజినల్ సినిమాలకి విడుదల వారానికి ముందు బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. కానీ, అమెరికాతో పాటే ఇండియాలోనూ ఏకంగా ఒక నెల రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేయడం ఒక రికార్డు. అయితే, అందరినీ ముక్కున వేలేసుకునేలా మెట్రో నగరాలైన ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కేవలం ఒక్క ఐమాక్స్ (IMAX) టికెట్ ధర అత్యధికంగా రికార్డు స్థాయిలో అక్షరాలా 3,300 రూపాయలు కావడం సినిమా సర్కిల్స్‌లో పెను సంచలనంగా మారింది.
ముంబైలోని పీవీఆర్ లోయర్ పరేల్ థియేటర్‌లో లేట్ నైట్ షోల ధరలు 1,500 రూపాయల నుండి ప్రారంభమై గరిష్టంగా 3,300 రూపాయలకు చేరుకున్నాయి. పూణేలోని సినీపోలిస్ విండ్స్ వెస్ట్ ఎండ్, ఐనాక్స్ మెగాప్లెక్స్ వంటి ప్రీమియం థియేటర్లలో రెక్లైనర్ సీట్ల ధరలు 1,600 రూపాయల నుండి 3,000 రూపాయల వరకు పలుకుతున్నాయి. బెంగళూరులోని కోరమంగళ ఐమాక్స్‌లో కూడా టికెట్ రేట్లు 900 నుండి 1,000 రూపాయల వరకు ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా "ఇదేమైనా లైవ్ కాన్సర్టా.. సినిమా టికెట్ రేట్లు ఇంతా?" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఇంత భారీ ధరలు ఉన్నప్పటికీ, బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం కొద్ది నిమిషాల్లోనే ప్రీమియం సీట్లు, రెక్లైనర్ వరుసలన్నీ ‘హౌస్‌ఫుల్’ అయిపోయాయి. ఈ స్థాయిలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటం చూసి ట్రేడ్ అనలిస్టులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇండియాలో క్రిస్టోఫర్ నోలన్ అనే పేరుకు ఉన్న తిరుగులేని బ్రాండ్ వాల్యూకి ఇదొక నిదర్శనం. ప్రమోషన్ల కోసం ఎలాంటి నటీనటులు ఇండియాకి రాకపోయినా, కేవలం దర్శకుడి పేరుతోనే నిమిషాల్లో షోలు నిండిపోవడం నోలన్ లెగసీని చాటిచెబుతోంది.
Also read: మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీస్ లిస్ట్ రిలీజ్.. అల్లు అర్జున్ ఎన్నో ప్లేస్‌లో ఉన్నాడంటే!
హోమర్ రాసిన పురాతన గ్రీక్ పురాణ గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ అడ్వెంచర్ డ్రామాలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా వంటి టాప్ గ్లోబల్ స్టార్స్ నటిస్తున్నారు. దాదాపు 250 మిలియన్ డాలర్స్ అంటే 2000 కోట్లకి పైగా భారీ నెట్ ప్రొడక్షన్ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం నోలన్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమాగా నిలవనుంది. అంతేకాకుండా, నోలన్ ఈ మూవీని పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతోనే షూట్ చేయడం విశేషం. ఇండియాలో చాలా థియేటర్లలో ఒరిజినల్ ఐమాక్స్ 70ఎమ్ఎమ్ ఫార్మాట్ లేకపోయినప్పటికీ, డిజిటల్ ఐమాక్స్ స్క్రీన్లపై ఈ దృశ్య కావ్యాన్ని ఆస్వాదించడానికి ఫ్యాన్స్ ఏమాత్రం వెనకాడటం లేదు.






