‘హనుమాన్’ భవితవ్యం.. ఆ ఒక్క ట్రైలర్‌పైనే ఆధారపడి ఉంది!
on Dec 14, 2023
.webp)
నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, రవితేజ.. ఇలా నలుగురు టాప్ హీరోల సినిమాలు వచ్చే సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. నా సామిరంగా, సైంధవ్, గుంటూరు కారం, ఈగిల్.. ఈ నాలుగు సినిమాలు పండగ సీజన్‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నలుగురు హీరోలతోనే పండగ వెళ్లిపోతుందన్న భావన అందరిలోనూ ఉంది. ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా తమ సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ మీడియాలో హాజరు వేసుకుంటున్న ఈ నలుగురు హీరోలతో ఓ యంగ్ హీరో తలపడబోతున్నాడు. అతనే ‘హనుమాన్’ చిత్రంతో పండగ పోటీలో నేనూ ఉన్నానంటున్న తేజ సజ్జా.
నలుగురు దిగ్గజ హీరోలు బరిలో ఉన్నప్పటికీ ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాతలు మాత్రం పెద్ద హీరోల సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తుందని నమ్ముతున్నారు. అందుకే ‘హనుమాన్’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు కూడా మొదలు పెట్టారు. తేజ సజ్జా ఏకంగా మహేష్‌తోనే డైరెక్ట్‌గా పోటీకి దిగుతున్నాడు. ‘గుంటూరు కారం’ జనవరి 12న విడుదల కానుంది. ‘హనుమాన్’ చిత్రాన్ని కూడా అదేరోజు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు నిర్మాతలు. థియేటర్లకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు బయ్యర్ల దృష్టంతా డిసెంబర్ 19న విడుదల కానున్న ‘హనుమాన్’ ట్రైలర్‌పైనే ఉంది.
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ‘హనుమాన్’ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు. ట్రైలర్ కట్ విషయంలో ప్రశాంత్ వర్మ ఎంతో కేర్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లోని విజువల్స్ అందర్నీ కట్టిపడేసేలా ఉన్నాయని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలా నెలల క్రితమే రిలీజ్ అయింది. అయితే తేజను బాలనటుడిగానే పరిగణిస్తున్న తరుణంలో పెద్ద హీరోలతో పోటీ పడేంత సీన్ అతనికి లేదని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరయ్యే హీరోలు ఎక్కువగా కనిపించడం లేదు. ‘హనుమాన్’ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటే తేజకు టాలీవుడ్‌లో సెటిల్ అయ్యేందుకు ఒక మంచి ప్లేస్ దొరుకుతుంది. అందుకే అందరి దృష్టీ రిలీజ్ కాబోయే ట్రైలర్ మీదే ఉంది. దాన్ని బట్టి సినిమాపై ఒక అంచనాకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తేజ ఒక సూపర్‌హీరో అనే విషయాన్ని జీర్ణించుకునేందుకు ప్రేక్షకులకు చాలా టైమ్ పడుతుంది. కాబట్టి అతని కోసం థియేటర్స్‌కి వచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉండొచ్చు. కేవలం హనుమాన్ అనే టైటిల్ వల్ల భక్తిభావంతోనే జనాన్ని థియేటర్లకు రప్పించేంత స్టఫ్ ట్రైలర్‌లో ఉండాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



