ENGLISH | TELUGU  

‘శ్వాగ్‌’ మూవీ రివ్యూ 

on Oct 4, 2024

తారాగణం: శ్రీవిష్ణు, రీతూవర్మ, మీరా జాస్మిన్‌,  దక్షా నాగర్కర్‌, గెటప్‌ శ్రీను, గోపరాజు రమణ, రవిబాబు, పృథ్వి, సునీల్‌, శరణ్యా ప్రదీప్‌ తదితరులు

సాంకేతిక వర్గం: 
సంగీతం: వివేక్‌ సాగర్‌ 
కెమెరా : వేదరామం శంకరన్‌ 
కూర్పు: విప్లవ్‌ 
రచన, దర్శకత్వం: హసిత్‌ గోలి 
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్‌ 
బ్యానర్‌: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 04.10.2024

శ్రీవిష్ణు తనదైన శైలిలో కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ మంచి విజయాలు నమోదు చేస్తున్నాడు. తనతో రాజరాజ చోర వంటి వైవిధ్య భరితమైన చిత్రాన్ని తీసిన హసిత్‌ గోలి రూపొందించిన శ్వాగ్‌ సినిమాతో మన ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. స్వాగణిక వంశయోధుడుగా నాలుగు పాత్రల్లో మన ముందుకు వచ్చాడు శ్రీవిష్ణు. రీతూ వర్మ, ఒకప్పటి మేటి తార మీరా జాస్మిన్‌, దక్ష నాగర్కర్‌ ముఖ్య భూమికల్లో నట్చిన ఈ చిత్రం అక్టోబర్‌ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా ..! 

కథ : 

1551 సంవత్సరంలో  స్వాగణిక వంశ రాజు భవభూతి(శ్రీవిష్ణు) తన భార్య రాణి వింజామర రుక్మిణి దేవి (రీతూవర్మ)కి దాసుడై బ్రతుకు వెళ్లదీస్తుంటాడు. మాతృ స్వామ్యం అంతుచూసి పితృ స్వామ్యం స్థాపించాలి అనే ఆశతో సమయం కోసం కాచుకుని ఉంటాడు. అక్కడి నుంచి 2024 లో మనం టైం ట్రావెల్‌ చేసి వచ్చేసి కొత్త భవభూతి ని పరిచయం చేసుకుంటాం. అతను రిటైర్‌ అవుతున్న %ూI%. తన పై అధికారి ఆడది కనుక ఆమె తన పెన్షన్‌ ఆపిన పట్టించుకోడు. ఎప్పుడు పోలీస్‌ స్టేషన్‌ లేదా రైల్వే స్టేషన్‌ లో ఉంటూ కాలం వెళ్లదీస్తుంటాడు. డబ్బు కోసం ఎం చెయ్యాలా అని సతమతమైపోతున్న అతనికి ఒక ఉత్తరం దొరుకుంటుంది. 

అతను స్వాగణిక వంశ వారసుడు అని. వంశవృక్ష నిలయం లో రాజ వంశస్థుల వివరాలు నమోదు చేసి అతని నిధి అతనికి దక్కేలా చేస్తారు అని తెలుసుకుని వెళ్తాడు. కానీ వాళ్ళు రాజ వంశ గుర్తు అయినా పలక తెమ్మంటే ఎం చెయ్యాలో పాలుపోక ఆలోచనలో పడతాడు. అప్పుడే అనుభూతి(రీతూ వర్మ) దగ్గర ఆ పలక ప్రత్యక్షం అవుతుంది. ఈ లోపు భవభూతి కి వచ్చిన ఉత్తరం లాంటిదే సింగ( శ్రీ విష్ణు) కి వస్తుంది. అతను భవభూతి మరియు రేవతి(మీరా జాస్మిన్‌) కొడుకు కానీ అతని ఉనికి తండ్రికి తండ్రి ఉనికి కొడుక్కి తెలియవు. మరి వీళ్లందరిని ఒక్క తాటి మీద కి తేవాలి అని అనుకుంటున్నా వ్యక్తి ఎవరు? చిరవి వారసుడు యయాతి కి వీరి కి సంబంధం ఏమిటి? సినిమా చూసి తెలుసుకోండి. 

విశ్లేషణ: 

వంశ పరంపర వారసత్వ హక్కు మగవారికో లేదా ఆడవారికో ఉండాలి అంటారు తప్ప వారివురు కానీ వారు ఉంటారని గుర్తించడం లేదు. సమాజం లో నిజమైన గుర్తింపు లేని వ్యక్తులు గా అణచివేత కు గురి అవుతూ అవమానాల పాలవుతూ బ్రతికేస్తున్న వారికి అవమానాలు ఛీత్కారాలు ఎదురవుతుంటే సమానత్వం ఎక్కడ నుంచి వస్తుంది? ఒక వేళా సమానత్వం కోసమే పోరాడుతున్నారు అనుకుంటే మరి వారిని మనలో ఒకరిగా గుర్తించడానికి అడ్డుపడుతున్న పాత సంప్రదాయాలు ఆలోచనలు ఎక్కడ మొదలు అయ్యాయి? దర్శకుడు హసిత్‌ గోలి తనదైన శైలి లో ఈ సున్నిత  కధాంశాన్నీ జనరంజకం గా చెప్పే ప్రయత్నం చేసాడు. 

శ్రీవిష్ణు అతనికి అన్ని విధాలు గా సహకారం అందించాడు. ఎప్పుడు చెయ్యని పాత్ర ఎంతో నైపుణ్యం తో చేసి ఒప్పించాడు. భవభూతి గా కాస్త కష్టపెట్టిన విభూతి గా మెప్పించాడు. యయాతి గా చాలా బాగా కనిపించాడు నటించాడు కూడా. మీరా జాస్మిన్‌ ఎక్కడ ఆపిందో అక్కడే మళ్ళీ మొదలు పెట్టాలి అనుకుంది ఏమో అద్భుతం గా నటించింది. రీతూ వర్మ, దక్షా కూడా తమ పాత్రలకు తగినట్టు నటించారు. మిగిలిన వారు తమకు ఇచ్చిన సరుకు మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. 

వీటికి తోడు ప్రొడక్షన్‌ వాల్యూస్‌, విఎఫ్‌ఎక్స్‌, కెమెరా పనితనం, మంచి పాటలు అన్ని సమకూరాయి అనుకుంటే సరుకు లో సత్తువ సరిపోలేదు. ఎందుకు రాజుల కలం లో కి వెళుతున్నాం? ఎందుకు ఇంతమంది వారసులు వస్తున్నారు? అసలు ఏమిటి బ్రహ్మోత్సవం అనుకుంటూ ఉంటాం తప్ప ఇదీ విషయం అని తెలిసే సరికి పుణ్యకాలం కాస్తా స్వాగార్పణం అయిపొయింది. చెప్పాలనుకున్న విషయం గొప్పది అయినప్పుడు మంచిది అయినప్పుడు తమిళ్‌ లో విజయ్‌ సేతుపతి చేసిన ‘‘సూపర్‌ డీలక్స్‌’’ లా మానని ఆ బాధ తో మమేకం అయ్యేలా చేస్తే అద్భుతం గా ఉండేది. ఎప్పుడో రాజులు చేసిన తప్పులు ఇప్పటికి మనలో అలానే నాటుకుపోయి ఉన్నాయి అని చెప్పడం లో తప్పు లేదు కానీ శాపాలు కోపాలు అంటూ మరీ ఫార్స్‌ ఫాంటసీ లో కి మనల్ని తోసేసాడు దర్శకుడు. 

కొన్ని సన్నివేశాలు తీసినప్పుడు అతని ప్రతిభ అబ్బురపరచకమానదు. ఉదాహరణకి భవభూతి కి హాస్పిటల్‌ కంపౌండర్‌ కి ఉన్న గ్లాస్‌ కనెక్షన్‌, యయాతి ని ఒప్పించలేక విభూతి పడ్డ పట్లు చూపించిన తీరు హత్తుకునే లా తీసి మెప్పించాడు. కానీ అవి ఎండాకాలం వానలా వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ మనల్ని మండే ఎండల్లో ఎడారి లో వదిలేసినట్టు వదిలేస్తాయి. నలుగురు శ్రీ విష్ణు పాత్రలు ఒకే చోట ఉన్న ఎవరు ఏమిటో తెలుసుకునే లా చేసిన కెమెరా పనితనం, మేకప్‌ వారి పనితనం అన్నటికి మించి శ్రీ విష్ణు నటనా ప్రతిభ మెచ్చుకోకుండా ఉండలేం. అదే సమయం లో ఇన్ని ఉంది ఇలా దారి తప్పింది ఏమిటి అని నొచ్చుకోకుండాను ఉండలేం. కొత్త ప్రయత్నమే కానీ మెచ్చుకుని వీరతాడ్లు వేద్దాం అంటే జంబూ చెబుతున్న కథ కి లంబూ ఇచ్చిన  వ్యాఖ్యానం లా అడ్డదిడ్డం గా దిద్దాడడం గా సాగే సరికి  ‘‘హై హై నాయక’’ అనటం కష్టమే! 

చివరిగా 

శ్రీ విష్ణు కష్టం, చెప్పిన విషయం, అందరి పనితనం ఇవి మనల్ని ఒక సరి చూసేందుకు ప్రేరేపించినా ఎటు వెళుతోంది ఈ పయనం ఏది నీ తీరం అనుకుంటూ బాధపడకుండా విసుగు చెందకుండా స్వాగణిక రాజు ని అనుసరించాలి అనుకున్నా ‘మార్గం’ కష్టమే!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.