Home

»

Latest News

సినిమాకి సైన్ చేసినా న‌న్ను తీసేశారు, హీరో భార్యే కార‌ణం.. తాప్సీ షాకింగ్ కామెంట్స్‌.!

Sep 28, 2026 12:43PM

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఎంత కష్టమో.. వచ్చిన అవకాశాలను చివరి వరకు నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టమని అంటుంటారు. ముఖ్యంగా సినిమా సైన్ చేసిన తర్వాత కూడా కొన్ని కారణాలతో నటీనటులు ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. తాజాగా నటి తాప్సీ పన్ను తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇలాంటి కొన్ని చేదు అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అయితే అందులో ఓ సినిమా నుంచి తనను తొలగించిన కారణం మాత్రం చాలా విచిత్రంగా ఉందని ఆమె వెల్లడించారు. 

ఇటీవల నయన్‌దీప్ రక్షిత్‌తో జరిగిన ఇంటర్వ్యూలో తాప్సీ తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఓ సినిమాకు తాను ఎంపికైన తర్వాత, హీరో తనను వద్దని చెప్పడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పించారని తెలిపారు. అసలు ఎందుకు తీసేశారో తనకు స్పష్టమైన కారణం చెప్పలేదని అన్నారు. దాంతో ఆ నిర్ణయం వెనుక కారణం ఏమై ఉంటుందో తానే ఊహించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. హీరోకు తనపై అసౌకర్యం కలిగి ఉండొచ్చని, తనకు బదులుగా అతడికి మరింత సన్నిహితమైన నటిని తీసుకోవాలనుకుని ఉండొచ్చని అనిపించిందని తాప్సీ పేర్కొన్నారు. అయితే ఇవన్నీ తన ఊహలు మాత్రమేనని, అసలు కారణం తనకు చెప్పలేదని స్పష్టం చేశారు.

అయితే మరో సందర్భంలో మాత్రం తనను సినిమా నుంచి ఎందుకు తప్పించారో చెప్పారని తాప్సీ తెలిపారు. అదే తనకు ఎదురైన అత్యంత విచిత్రమైన కారణమని అన్నారు. ‘హీరో భార్యకు మీరు నచ్చలేదు’ అని తనకు చెప్పినట్లు తాప్సీ వెల్లడించారు. ఆమెకు తానెందుకు నచ్చలేదో ఇప్పటికీ తనకు తెలియదని అన్నారు. ఈ సంఘటనలో కూడా హీరో ఎవరు, ఆయన భార్య ఎవరు అనే విషయాలను తాప్సీ వెల్లడించలేదు. దీంతో ఆ సినిమా ఏదనేది కూడా ఇప్పుడు స్పష్టంగా తెలియదు.

ఇదిలా ఉంటే.. పరిశ్రమలో నటీనటులను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేసే టైప్‌కాస్టింగ్‌పై కూడా తాప్సీ మాట్లాడారు. గ్లామర్ పాత్రలకు కొందరు హీరోయిన్లను, సీరియస్ లేదా సమస్యాత్మక కథల్లోని పాత్రలకు మరికొందరిని మాత్రమే ఎంపిక చేసే ధోరణి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు సినిమా మొదలయ్యే ముందే కథ ఎలా సాగుతుందో ఊహించే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో తాను కొన్ని అవకాశాలను స్వయంగా వదులుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను కథ, పాత్ర తనకు కొత్తగా అనిపిస్తేనే సినిమాను ఎంచుకునేలా జాగ్రత్త పడుతున్నానని తాప్సీ చెప్పుకొచ్చారు.

 

 

[Taapsee Pannu, Taapsee Pannu News, Taapsee Pannu Bollywood, Taapsee Pannu Interview, Taapsee Pannu Film Replaced, Taapsee Pannu Hero Wife, Taapsee Pannu Latest News, Bollywood News, Taapsee Pannu Casting, Taapsee Pannu Movies]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com