5 కోట్ల ఖరీదు చేసే బట్టలా? ఎవరు చెప్పారు?
on Oct 6, 2017
వ్యూస్ కోసం.. నెటిజన్లు.. రేటింగ్ కోసం ఛానల్స్.. సర్య్కులేషన్ కోసం పేపర్లు. వీటి జీవన పరమావధి ఇదే. ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలనం కావాలి వీళ్లకు. పోటీ పెరిగిపోవడంతో ఇది మరీ ఎక్కువైపోయింది. సంచలనాల కోసం ఊహించి ఏదో ఒకటి రాసేస్తున్నారు.
‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం చిరంజీవి 5 కోట్ల రూపాయల ఖరీదు చేసే దుస్తులను ధరిస్తున్నాడు’.. అనేది లేటెస్ట్ న్యూస్. అసలు ఇందులో నిజం ఎంత? అనే విషయాన్ని పక్కనపెడితే... అసలు ‘సైరా’లో చిరంజీవి చేస్తున్న పాత్ర ఏంటి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు? ఎలా ఉంటాడు? ఎలాంటి దుస్తులు ధరిస్తాడు? అతని ప్రాంతం ఏంటి? అతని సంప్రదాయం ఏంటి? ఇవన్నీ తెలుసుకోకుండా.. ‘చిరంజీవి సినిమా’ అనగానే చేతికొచ్చింది రాసేయడం... నోటికొచ్చింది అనేయడం. ఏంటీ దారుణం.
నరసింహారెడ్డి.. ఒక యోధుడు. మహారాజు కాదు. ఆయన పోరాటం ఎక్కువశాతం అడవుల్లోనే జరిగింది. గెరిల్లా యుద్ధానికి నాంది పలికిన యోధుడాయన. అంతఃపుర సౌకర్యాలు ఆయనకు లేవు. పట్టు పీతాంబరాలు ఆయన ధరించలేదు. వజ్రవైఢూర్యాలపై ఆయనకు మోజు లేదు. కేవలం స్వతంత్ర్య కాంక్ష.. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయనకు 5 కోట్ల బట్టలేంటి? ఏమిటీ అర్థంలేని రాతలు?
‘సైరా’లో చిరంజీవి చేయనుంది... తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర కాదు. శివాజీ మహారాజ్ పాత్ర అంతకన్నా కాదు. కోట్లు ఖరీదు చేసే కాస్ట్యూమ్స్ వేయడానికి.
గాలివార్త లైనా... ఆలోచించి రాయండయ్యా!