
అదేంటి..సినిమా బాగానే ఆడుతుంది కదా..మరి నిరాహారదీక్ష దేనికి అంటారా..? ఇది సినిమా కోసం కాదు..ఇండస్ట్రీ కోసం చేస్తున్నాడు 24 సినిమా నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా. ఈ సినిమాకు సూర్య నిర్మాత అయితే, సహ నిర్మాతగా జ్ఞాన్ వేల్ రాజా వ్యవహరించారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన 24 సినిమా రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నా, తమిళనాడులో పైరసీ ప్రింట్స్ చాలా ఎక్కువగా షేర్ అవుతూ, సినిమాను ఘోరంగా దెబ్బ తీస్తున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే సినిమా విడుదల రోజునే పైరసీ సీడీలు మల్టీప్లెక్స్ నుంచి డైరెక్ట్ గా రిలీజ్ అయిపోయాయి. సూర్య నటించిన వీడొక్కడే సినిమాలో ఇలాంటి విషయాన్నే సూర్య టచ్ చేశాడు. ఇప్పుడు డైరెక్ట్ తన సినిమాయే ఇలా పైరసీ భూతానికి గురవ్వడం విచిత్రం.
ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ద్వారా, పైరసీ ఎక్కడ చేశారో గుర్తుపట్టగలిగారు. బెంగళూరులోని పివిఆర్ మాల్ లో ఉదయం 9.45 గంటలకు పైరసీ సీడీని రికార్డ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా తాను నిరాహారదీక్షకు కూర్చుంటున్నట్లు ప్రకటించిన జ్ఞాన్ వేల్ రాజా నిన్న సాయంత్రం నుంచి దీక్ష మీద ఉన్నారు. సినీ పెద్దలు ఈ విషయంపై స్పందించే వరకూ తన దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తీసే సినిమాకు పైరసీ ద్వారా ఎంత నష్టం కలుగుతుందో అందరీకీ చెప్పే ప్రయత్నంగానే కాక, సినీ పరిశ్రమ దీనిపై కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పైరసీని అరికట్టాలని ఎంతమంది పిలుపునిచ్చినా, అది ఆగకపోగా మరింత తీవ్రరూపం దాలుస్తూ ఎంతో మంది నిర్మాతల్ని తీవ్రనష్టాలపాలు చేస్తోంది. అత్తారింటికి దారేదితో సమస్య తీవ్రత బయటికొచ్చిన సంగతి తెలిసిందే.






