సూర్య కోసం రంగంలోకి లేడీ డైరెక్టర్..!
on Jul 22, 2023

వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న హీరోల్లో కోలీవుడ్ హీరో సూర్య ఒకరు. నచ్చిన సినిమాలోనూ తన పాత్ర కోసం ఆయన రిస్క్ చేయటానికి వెనుకాడరు. వరుస సినిమాలను ఆయన లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే సూర్య 42వ చిత్రంగా `కంగువా` సినిమాను చేస్తున్నారు. మరో వైపు వెట్రిమారన్‌తో `వాడివాసల్` చిత్రం చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే వెట్రి మారన్ మూవీ చేయటం కంటే ముందే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సినిమాను కంప్లీట్ చేయటానికి సూర్య రెడీ అయిపోయారు. ఇప్పటికే ఆమె సూర్య ఇమేజ్‌కు తగ్గట్టు ఓ కథను సిద్ధం చేసేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. సూర్య 43వ మూవీగా ఇది రూపొందనుంది.
సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు.. సుధా కొంగరతో సూర్య చేయబోతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన సూర్య పుట్టినరోజు (జూలై 23) సందర్భంగా విడుదల చేస్తారని టాక్. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే వచ్చిన శూరరై పోట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా) చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇది సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది.
సాలిడ్ హిట్ కోసం సూర్య వెయిట్ చేస్తోన్న సందర్భంలో శూరరైపోట్రు ఆయనకు ఊపిరిపోసిందనే చెప్పాలి. దీంతో సుధా కొంగరపై సూర్యకు మంచి గురి కుదిరింది. సుధా కొంగర ఈసారి సూర్య గ్యాంగ్‌స్టర్‌గా చూపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన శూరరైపోట్రు సినిమాను సూర్యనే నిర్మించారు. మరి తన 43వ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తారా? లేక మరో నిర్మాత సినిమాను రూపొందిస్తారా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
ప్రస్తుతం సూర్య కంగువా అనే మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు చేయనటువంటి ఫిక్షనల్ జోనర్‌లో తొలిసారి సూర్య కనిపించబోతున్నారు. డైరెక్టర్ శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



