30 ఏళ్లుగా డింపుల్, సన్నీ వివాహేతర బంధం!
on Nov 24, 2020
ఒకప్పటి బాక్సాఫీస్ సూపర్‌స్టార్ సన్నీ డియోల్.. తను కోల్పోయిన స్టార్‌డమ్‌ను తిరిగి పొందడానికి నానా అగచాట్లూ పడుతున్నాడు. ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన తన గుడ్ లుక్స్, పర్ఫార్మెన్స్‌తోనే కాకుండా కాంట్రవర్షియల్ లవ్ లైఫ్‌తోనూ వార్తల్లో నిలిచాడు. లండన్‌కు చెందిన పూజ అనే యువతిని పెళ్లాడిన తర్వాతే హీరోగా 'బేతాబ్' (1983)తో ఎంట్రీ ఇచ్చాడు సన్నీ. అయినప్పటికీ మరో వివాహితురాలైన నటి డింపుల్ కపాడియాతో ప్రేమలో పడ్డాడు. ఆమె అప్పటికే బాలీవుడ్ ఫస్ట్ సూపర్‌స్టార్ రాజేశ్ ఖన్నాను వివాహమాడారు.
సన్నీ, డింపుల్ జంటగా పలు సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు. అర్జున్, మంజిల్ మంజిల్, ఆగ్ కా గోలా, గునాహ్, నరసింహా లాంటివి వాటిలో ఉన్నాయి. ఇద్దరూ వివాహితులైనప్పటికీ, వారి ప్రేమ వ్యవహారం గురించి రాని న్యూస్ పేపర్ కానీ, మ్యాగజైన్ కానీ ఆ రోజుల్లో లేవు. అయితే తమ మీద ఎన్ని కథలు, కథనాలు వచ్చినా తమ బంధం గురించి పబ్లిగ్గా వారెప్పుడూ మాట్లాడింది లేదు.
ఆ తర్వాత రాజేశ్ ఖన్నాకు విడాకులిచ్చేసిన డింపుల్ తన బాయ్‌ఫ్రెండ్‌తో మరింత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. సన్నీని డింపుల్ ఇద్దరు కుమార్తెలు రింకెల్, ట్వింకిల్ "చోటే పాపా" అని పిలుస్తూ వచ్చారంటే వారి బంధం ఎంత స్ట్రాంగ్ అయ్యిందో ఊహించుకోవచ్చు. 2009లో డింపుల్ చెల్లెలు సింపుల్ కపాడియా మృతి చెందినప్పుడు, డింపుల్ పక్కనే ఉండి, అన్ని పనులూ చూసుకున్నాడు సన్నీ.
ఆ ఇద్దరూ రహస్యంగా పెళ్లాడారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. పలు కార్యక్రమాల్లో, సినిమా పార్టీల్లో డింపుల్‌కు సన్నీ భార్య స్థానాన్ని ఇచ్చాడని కూడా చెప్పుకుంటారు. డింపుల్‌ను వదిలిపెట్టకపోతే తమ ఇద్దరు కొడుకుల్ని తీసుకొని తనదారి తను చూసుకుంటానని సన్నీని భార్య పూజ హెచ్చరించారనే రిపోర్టులు కూడా ఉన్నాయి. దాంతో భార్యాపిల్లలతో ఉండటానికే సన్నీ మొగ్గు చూపాడు. అలా అని డింపుల్‌తో తన బంధాన్ని ఆయన తెంచుకోలేదు.
చాలామంది సెలబ్రిటీ లవర్స్ మాదిరిగానే ఆ ఇద్దరూ తమ బంధాన్ని రహస్యంగా కొనసాగిస్తూ వచ్చారు. వారి మధ్య బంధం ముగిసిపోయిందని కొన్నేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. పదకొండేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఆ ఇద్దరూ తర్వాత కాలంలో కలుసుకోలేని పరిస్థితి వచ్చింది. అయితే తమ మధ్య ప్రేమ అలాగే ఉందని ఇటీవల ఘటనతో మరోసారి రుజువైంది.
గత ఏడాది ఆ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఓ వీడియో వైరల్ అయ్యింది. మొనాకోలో ఆ ఇద్దరూ ఒక బెంచ్‌పై పక్కపక్కనే కూర్చొని, టీనేజ్ లవర్స్ మాదిరిగా చేయి చేయీ కలిపి మాట్లాడుకుంటున్నారు ఆ వీడియోలో. హాలిడేస్‌ను ఎంజాయ్ చేయడానికే వాళ్లిద్దరూ తమ కుటుంబాల్ని వదిలి మొనాకోకు వెళ్లారంటారు. అలా 30 ఏళ్ల తర్వాత కూడా వారి మధ్య ప్రేమానుబంధం ఇంకా నిలిచే ఉందని ప్రపంచానికి వెల్లడైంది.