Home

»

Latest News

షాపింగ్‌కి వెళ్లినందుకు పోస్ట‌ర్‌లో నా ఫోటో తీసేశారు.. సున‌య‌న వీడియో వైర‌ల్‌!

May 14, 2026

తెలుగు చిత్రపరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సోషల్ మీడియాలో 'ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్'గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న సునయన బాదం తాజాగా వార్తల్లో నిలిచారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడుగురు మహిళల ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. అయితే ఈ పోస్టర్‌లో తన ఫోటో లేకపోవడంపై సునయన సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

సినిమా కోసం ఎంతో కష్టపడి షూటింగ్ చేసినా, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తనను పక్కన పెట్టడం బాధ కలిగించిందని సునయన ఆవేదన చెందారు. "విదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు గ్యాప్ దొరికితే షాపింగ్‌కు వెళ్లడం సహజం.. అంత మాత్రానికే పోస్టర్‌లో లేకుండా చేస్తారా?" అని ఆమె ప్రశ్నించారు. ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు ఎందుకు లేవని అడుగుతున్నారని ఆమె ఎమోషనల్ అయ్యారు.

సునయన వ్యాఖ్యలపై దర్శకుడు అభిరామ్ నాయుడు వెంటనే స్పందించారు. పారిస్‌లో షూటింగ్ జరిగినప్పుడు సునయన అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని ఆయన వివరించారు. అందరూ చలిలో షూటింగ్ చేస్తుంటే, ఆమె షాపింగ్‌కు వెళ్లారని, ఆ సమయంలో తీసుకున్న ఫోటోలతోనే పోస్టర్ డిజైన్ చేశామని స్పష్టం చేశారు. ఆమెను వీఎఫ్ఎక్స్‌లో యాడ్ చేయడానికి ప్రయత్నించినా అది సహజంగా లేదని అందుకే వదిలేశామని క్లారిటీ ఇచ్చారు.

అయితే దీనిపై సునయన మళ్ళీ స్పందిస్తూ.. తాను షూటింగ్ ఆపేసి వెళ్లలేదని, కో-డైరెక్టర్ అనుమతితోనే వెళ్లానని చెప్పుకొచ్చారు. కేవలం ఒక నటిగా తన బాధను పంచుకున్నానని, ఎవరినీ నిందించాలని కాదని పేర్కొన్నారు. మొత్తానికి దర్శకుడు, నటి మధ్య జరిగిన ఈ చర్చ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

'హ్యాపీ జర్నీ' సినిమాలో ఆమని, ఝాన్సీ, అన్నపూర్ణమ్మ వంటి సీనియర్ నటీమణులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూరప్‌లోని అందమైన లొకేషన్లలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏడుగురు మహిళల భావోద్వేగాలు, వారి జీవిత ప్రయాణాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

మరోవైపు, ఈ వివాదం అంతా సినిమా ప్రమోషన్లలో భాగంగా చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ చిన్నపాటి గొడవతో 'హ్యాపీ జర్నీ' మూవీకి గట్టి హైప్ అయితే లభించింది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ ప్రయాణం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com