సీతారామశాస్త్రికి సుకుమార్ అక్షర నివాళి.. వైరల్ అయిన ఎలిజీ!
on Dec 1, 2021

అక్షర యోధుడు, లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక, అకాల మరణం నుంచి తెలుగు చిత్రసీమ తేరుకోలేకపోతోంది. పైకి దుఃఖిస్తున్న వాళ్లే కాదు, తన్నుకొస్తున్న దుఃఖాన్ని లోలోన అదిమిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వారెందరో. తెలుగు గీతరచయితలది ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్న దుఃఖం. రచయితలది సాహితీ గురువును కోల్పోయిన దుఃఖం.
సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన వేలాది పాటల్లో నాణ్యమైనవి కానివాటిని ఎంచడం చాలా కష్టం. అర్థంపర్థంలేని పాట ఏనాడూ ఆయన రాయలేదు. అక్షరాలతో ఆయన చేసిన పద విన్యాసాలెన్ననీ! ప్రతి పాటా మనకు ఏదో ఒక విషయాన్ని నేర్పేదే. అందుకే స్వయానా రచయిత కూడా అయిన టాప్ డైరెక్టర్ సుకుమార్ తనలోపలి దుఃఖాన్ని అణచిపెట్టుకోవడానికి నానా యాతన పడుతున్నాడు. సీతారామశాస్త్రికి తన అక్షరాలతోటే నివాళి ఇచ్చాడు. తన ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా సుకుమార్ పంచుకున్న ఎలిజీ (స్మృతి గీతం) ఇప్పుడు వైరల్‌గా మారింది.
"గుండె నిండు గర్భిణిలా ఉంది
ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది.
తల్లి కాగితానికి దూరమై
అక్షరాల పిల్లలు
గుక్కపట్టి ఏడుస్తున్నాయ్
మీరు బ్రతికే ఉన్నారు
పాట తన ప్రాణం పోగొట్టుకుంది
మీరు ఎప్పటికీ రాయని పాటలాగ
మేం మిగిలిపోయాం" అంటూ తన దుఃఖాన్ని అక్షరాల రూపంలో పంచుకున్నాడు సుకుమార్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



