సుధీర్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్!
on Mar 19, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. 'హరి హర వీరమల్లు' సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. 'వినోదయ సిత్తం' రీమేక్ షూటింగ్ మొదలైంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' చేయాల్సి ఉంది. ఇక ఇప్పుడు మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేసే అవకాశముంది. ఈ విషయాన్ని స్వయంగా సుధీర్ రివీల్ చేయడం విశేషం.
'స్వామిరారా'తో దర్శకుడిగా పరిచయమైన సుధీర్.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తరువాత 'దోచేయ్', 'కేశవ' సినిమాలతో పరవాలేదు అనిపించుకున్నప్పటికీ.. ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. త్వరలో ఆయన రవితేజ హీరోగా తెరకెక్కిన 'రావణాసుర' చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను పవన్ కళ్యాణ్ తో చేయాల్సిన సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఓ స్టోరీ లైన్ రాసి అది తనను డెవలప్ చేయమన్నారని, ఆ లైన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చిందని సుధీర్ చెప్పాడు. అయితే ప్రస్తుతం పవన్ ఇతర ప్రాజెక్ట్స్, పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారని.. కాబట్టి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపాడు. మరి త్రివిక్రమ్ కథతో పవన్ హీరోగా సుధీర్ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
