దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో సినిమా కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌పై గతంలో చాలాసార్లు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సూర్యతో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇటీవల ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి, సూర్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్యతో సినిమా గురించి ప్రశ్నించగా.. ఈ ప్రశ్న అడుగుతారని తనకు ముందే తెలుసని, అందుకు సమాధానం కూడా సిద్ధంగా ఉందని రాజమౌళి చెప్పారు. అయితే ప్రస్తుతం తాము వచ్చిన కార్యక్రమం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రమోషన్ కోసం కాబట్టి, తన గురించి, సూర్య గురించి మాట్లాడితే అదే ప్రధాన వార్తగా మారి అసలు సినిమా వెనక్కి వెళ్లిపోతుందని ఆయన అన్నారు. అందుకే ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ గురించి వివరాలు చెప్పడం సరికాదని స్పష్టం చేశారు.
అయితే అదే సమయంలో సూర్య అభిమానుల్లో ఉత్సాహం పెంచే మాట కూడా రాజమౌళి చెప్పారు. తామిద్దరం ఎప్పుడు కలిసి సినిమా చేసినా అది కచ్చితంగా చాలా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో వీరి కాంబినేషన్‌పై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, కథ ఏంటి, షూటింగ్ ఎప్పుడు అనే విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కేవలం భవిష్యత్ కాంబినేషన్‌పై ఆయన చెప్పిన మాటలుగానే చూడాలి.
ఇదిలా ఉంటే.. సూర్య ఇటీవల ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాలతో విజయాలు అందుకోవడంపై కూడా రాజమౌళి ప్రశంసలు కురిపించారు. వరుస విజయాలను ‘డబుల్ ధమాకా’గా అభివర్ణించిన ఆయన.. జితూ మాధవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న ‘సీన్’ ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగుందని అన్నారు. గతంలో సూర్య కూడా రాజమౌళితో కలిసి పనిచేయాలనే తన కోరికను పలుమార్లు వెల్లడించారు. 2024లో ‘కంగువ’ ప్రమోషన్ సందర్భంగా రాజమౌళి కూడా సూర్యను ప్రశంసిస్తూ, గతంలో తానే సూర్యతో కలిసి పనిచేసే అవకాశాన్ని మిస్ అయ్యానని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో భవిష్యత్‌లో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందా అనే ఆసక్తి మాత్రం కొనసాగుతోంది.
[SS Rajamouli, Suriya, Rajamouli Suriya Movie, Rajamouli Suriya Combination, SS Rajamouli Next Movie, Suriya Next Movie, Rajamouli Latest News, Suriya Latest News, Dont Trouble The Trouble, Scene Movie, Tamil Telugu Cinema, Rajamouli Suriya Collaboration]






