'ఆర్ఆర్ఆర్' అక్టోబర్ 13 విడుదల
on Jan 25, 2021
ఇదివరకు అనుకున్నట్లు అక్టోబర్ 8న కాకుండా అక్టోబర్ 13న 'ఆర్ఆర్ఆర్' మూవీ విడుదలవుతోంది. యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూట్లో ఉంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
'ఆర్ఆర్ఆర్' మూవీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో చరణ్ గుర్రంపై దౌడు తీస్తుంటే, తారక్ బైక్‌ను నడుపుతున్నాడు. ఒకరికొకరు పోటీ పెట్టుకున్నట్లుగా వేగంగా పోతున్నారు. ఈ పిక్చర్తో పాటు, "This October 13, witness Fire and Water wave come together as a FORCE that has never been experienced before. The biggest collaboration in Indian cinema is set to deliver a memorable experience!!! THE RIDE BEGINS..." (ఇదివరకెన్నడూ చూడని విధంగా నిప్పు, నీరు కలిసి ఒక శక్తిగా వస్తుండటాన్ని ఈ అక్టోబర్ 13న చూడబోతున్నాం. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ కొలాబరేషన్ ఒక మరపురాని అనుభవాన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రైడ్ మొదలవుతోంది.) అంటూ రాసుకొచ్చారు.
అలియా భట్, ఒలీవియో మోరిస్, అజయ్ దేవ్‌గణ్, సముద్రకని, శ్రియ, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి, సెంథిల్ కుమార్, వి. విజయేంద్రప్రసాద్, సాబు సిరిల్ లాంటి దిగ్గజ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.
ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని ఎలా ప్రారంభించారనేదే కథాంశం.