
సెల్యులాయిడ్ పై గంభీరమైన స్వరంతో రౌద్ర రసంతో పాటు ప్రేమని కురిపించే ఆత్మీయతని పండించగల నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క శ్రీహరి మాత్రమే. కేవలం తన క్యారక్టర్ వల్లనే హిట్ అయిన సినిమాలు సైతం ఉన్నాయి. హీరోగాను సత్తా చాటి వందరోజుల పోస్టర్ తన గుమ్మం ముందు పడిగాపులు కాచేలా చేసుకున్నాడు . ఈ రోజు శ్రీహరి గారు చనిపోయిన రోజు.
ఆగస్టు 15, 1964న కృష్ణా జిల్లా ఏలమర్రులో జన్మించి, హైదరాబాదులోని బాలానగర్ లో పెరిగిన శ్రీహరి జీవితం ఒక రియల్ హీరో ప్రయాణం. చిన్నతనంలో కుటుంబ పోషణ కోసం పేపర్ బాయ్‌గా, పాలు అమ్మే కుర్రాడిగా పనిచేసిన శ్రీహరి, క్రీడల్లో జిమ్నాస్టిక్స్ అథ్లెట్‌గా ప్రతిభ చూపారు. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మరియు రైల్వే ఆఫీసర్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు వరుసగా వెతుక్కుంటూ వచ్చినా, నటనా రంగంపై ఉన్న మక్కువతో ఆ ఆఫర్లను సైతం తిరస్కరించడం ఆయన అంకితభావానికి నిదర్శనం.
కళామతల్లిపై ఉన్న ప్రేమతో 1980ల కాలంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీహరి, తొలినాళ్లలో భయంకరమైన ఫైట్లు చేసే స్టంట్ ఫైటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. దర్శక రత్న దాసరి నారాయణరావు 1987లో 'బ్రహ్మ నాయుడు' చిత్రం ద్వారా నటుడిగా వెండితెరకి పరిచయం చేశారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందలాది చిత్రాల్లో మెప్పించి,1990ల చివర్లో 'పోలీస్' సినిమాతో హీరోగా మారిన శ్రీహరి, బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించి, చిన్న బడ్జెట్ సినిమాలకు సరికొత్త ఓపెనింగ్స్ బాట పరిచారు. భద్రాచలం, గణపతి, అయోధ్యా రామయ్య, దాసన్నా వంటి చిత్రాలతో యాక్షన్ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరపడిన 'రియల్ స్టార్' .
శ్రీహరి నటజీవితంలో వర్ణించలేని మలుపు ఆయన సహాయ నటుడి పాత్రలు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంలో శివరామకృష్ణగా చెల్లెలిపై ప్రేమ కురిపించే అన్నయ్య పాత్రలో జీవించి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును అందుకని 2005 లో రికార్డు సృష్టించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రంలో 'షేర్ ఖాన్'గా, బైరవగా ఆయన చూపించిన విక్రమార్క గంభీరత, 'వంద మందినా.. ఒకేసారి పంపు' అని చెప్పే ఆవేశభరిత సంభాషణలు తెలుగు సినీ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఢీ, కింగ్, బృందావనం వంటి చిత్రాల్లో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తన నటనా జీవితంలో దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి, మొత్తం 7 నంది అవార్డులను గెలుచుకోవడం ఆయన నటనకు దక్కిన నిదర్శనం. వెండితెర పైనే కాదు, నిజ జీవితంలోనూ ఆయన శ్రీహరి. తన నాలుగు నెలల కుమార్తె అక్షర అకాల మరణం పొందినప్పుడు, ఆమె జ్ఞాపకార్థం 'అక్షర ఫౌండేషన్' స్థాపించి సమాజసేవలో అడుగుపెట్టారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 4 గ్రామాలను దత్తత తీసుకుని, అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి తన సంపాదనలో 50 శాతానికి పైగా విరాళంగా ఇచ్చారు.
.webp)
అక్టోబర్ 9, 2013న ముంబైలోలో షూటింగ్ సమయాన కాలేయ సంబంధిత అస్వస్థతతో 49 ఏళ్ల చిన్న వయసులోనే కన్నుమూసి తీరని లోటు మిగిల్చారు. శ్రీహరి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన ఎన్నో క్యారెక్టర్స్, నిస్వార్థ సేవా కార్యక్రమాలు తెలుగు వారి గుండెల్లో నిరంతరం సజీవంగా ఉంటాయి.
[Srihari Death Anniversary Real Star Legacy, Srihari Death Anniversary, Real Star Srihari, Sher Khan Magadheera, Srihari Iconic Roles, Telugu Cinema, Telugu Cinema News, Tollywood Cinema, Tollywood Cinema News]





