చిరుగాలిలా వచ్చి.. గాలివానలా మారిన అరుదైన స్వరబ్రహ్మ కె.వి. మహదేవన్!
on Jun 21, 2021

తెలుగు చలనచిత్ర చరిత్రలో అనుకోని అందమైన మలుపు కె.వి. మహదేవన్ మధుర సంగీతం, మామా అని ఇండస్ట్రీలో ముద్దుగా పిలుచుకొనే ఆయన మంచి మనసులు చిత్రంతో చిరుగాలిలా వచ్చి సంగీతాన్ని చిలికి చిలికి గాలివానలా మారారు. తెలుగులో 'స్వరబ్రహ్మ'గా, తమిళంలో 'తిరై ఇసే తిలగం'గా ఆయన అందుకున్న రెండు బిరుదులకు అన్ని విధాల అర్హతలున్న వ్యక్తి. సినిమా సంగీత ప్రపంచంలో ఎందరో మహానుభావులు వచ్చారు, వస్తున్నారు, ఇక ముందు కూడా వస్తారు. కానీ మహదేవన్‌లా సామాన్యునికి కూడా అర్థమయ్యేలా సంగీతాన్ని ఇవ్వాలనుకునేవారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన సంగీత సామ్రాట్ ఆయన.
బాబూ మూవీస్ బ్యానర్‌కు ఆయన సంగీతం కూర్చిన 'మంచి మనసులు', 'మూగ మనసులు', 'తేనె మనసులు', 'కన్నె మనసులు' చిత్రాలు అందరి మనసుల్నీ దోచుకున్నాయి. మెలోడీ చెయ్యడంలో అసమాన ప్రతిభ కలిగిన మహదేవన్, "గోరొంక గూటికే చేరావు చిలకా" (దాగుడు మూతలు), "నీవు నా ఊహలందే నిలిచావూ" (ఇల్లాలు) లాంటి మధురమైన గీతాలూ, "అయ్యయ్యో బ్రహ్మయ్య" (అదృష్టవంతులు), "చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది" (బంగారుబాబు) లాంటి సరదా పాటలు సమపాళ్లలో చేసి తన సంగీతానికి తిరుగులేదని చూపించారు.
ముఖ్యంగా మహదేవన్ శాస్త్రీయ సంగీత పద్ధతిలో తెలుగువాళ్లకు ఒక కొత్తదనం కనిపించింది. "చూచి వలచి చెంతకు పిలచి" (వీరాభిమన్యు), "అమ్మ కడుపు చల్లగా" (సాక్షి) పాటలు మామ మనకిచ్చిన వరాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫోక్ సాంగ్స్ ఆయనలా చేసినవాళ్లు లేరు. "ఎంకొచ్చిందోయ్ మావా ఎదురొచ్చిందోయ్" (దాగుడుమూతలు), "గోదారి గట్టుంది గట్టుమీన సెట్టుంది" (మూగ మనసులు), "మావ మావా మావా" (మంచి మనసులు) పాటలను ఎప్పటికీ మరచిపోలేం.
ఘంటసాల గారి తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ లాంటి కొత్త గొంతులతో చక్కని పాటలు పాడించి 'శంకరాభరణం' చిత్రంతో బాలుకు ప్రత్యేక స్థానాన్ని కల్పించింది మహదేవనే. పాశ్చాత్య ఛాయలు లేకుండా కేవలం తన మృదుమధుర సంగీతంతోనే ఎన్నో సంవత్సరాల పాటు ఆయన తెలుగువారి అభిమాన సంగీత దర్శకులయ్యారు. ఈరోజు ఆయన 20వ వర్ధంతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



