తెరపై కనిపించేది కమల్.. వినిపించేది బాలు!
on Sep 26, 2020

అందరు హీరోల కంటే కమల్ హాసన్‌కు బాలు గొంతు బాగా నప్పుతుందనేది అనేకమంది అభిమానుల అభిప్రాయం. అందులో తప్పేమీ లేదు. పాటల విషయం అలా ఉంచితే.. తెలుగులో కమల్ డబ్బింగ్ సినిమా అంటే ఆయనకు గొంతుగా మారేది మాత్రం బాలునే. కె. బాలచందర్ డైరెక్ట్ చేసిన 'మన్మథ లీలై' (1976) మూవీ నుంచి ఇది ప్రారంభమైంది. తెలుగులో 'మన్మథ లీల' పేరుతో విడుదలైన డబ్బింగ్ సినిమా కోసం తొలిసారిగా కమల్‌కు తెరపై వాయిస్ ఇచ్చారు బాలు. అది మొదలు.. తెలుగులో రిలీజయిన కమల్ ప్రతి డబ్బింగ్ సినిమాకూ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు బాలు.
ఇక కమల్ పది క్యారెక్టర్లు చేసిన 'దశావతారం'లో ఏడు క్యారెక్టర్లకు బాలు తన గొంతునిచ్చారు. వాటిలో ఫిమేల్ క్యారెక్టర్ కూడా ఉండటం గమనార్హం. తెర బయట బాలు, కమల్ బంధం కూడా ఎంతో ప్రత్యేకమైంది. బాలు అంటే కమల్‌కు పూజ్య భావం. ఆయనను సొంత అన్నయ్యలా కమల్ భావిస్తారు. బాలు మృతితో కమల్ బాధ వర్ణనాతీతం.
"ఆయన నా విమర్శకుడు, సలహాదారు. నటనపై ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. తెలుగులో విడుదలైన నా సినిమాలకు ఆయన డబ్బింగ్ చెప్పారు. వందో అంతకంటే ఎక్కువో.. బహుశా 150 సినిమాలు కూడా కావచ్చు. ప్రతి సందర్భంలోనూ ఎస్పీబీ సాంగ్ ఉంటుంది.. ఆఖరుకి కరోనా వారియర్స్ కోసం కూడా ఆయన పాడారు. అనేక సందర్భాల్లో నాకు పీఆర్వోగా వ్యవహరించారు." అని నివాళి అర్పించారు కమల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



