Home

»

Latest News

ఫోన్‌లో అదిరిపోతుంది.. థియేట‌ర్‌లో ప‌రిస్థితి ఏంటి?.. AIపై 'బాహుబ‌లి' నిర్మాత కామెంట్స్‌.!

Sep 29, 2026 7:16PM

సినిమా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. దీనివల్ల సినిమాల నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గిపోతాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఏఐతో రూపొందించిన కొన్ని షార్ట్ వీడియోలు, విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. భవిష్యత్తులో గ్రాఫిక్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏఐపై ఉన్న ఈ అంచనాలన్నీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యేవి కావని ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పష్టం చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏఐ వినియోగంపై మాట్లాడిన శోభు యార్లగడ్డ.. సినిమా నిర్మాణంలో ఇది ఉపయోగపడే టెక్నాలజీయేనని చెప్పారు. ముఖ్యంగా దర్శకులు తమ ఆలోచనలను టీమ్‌కు త్వరగా అర్థమయ్యేలా చూపించడానికి, స్టోరీ బోర్డింగ్, కాన్సెప్ట్ ఆర్ట్ వంటి పనుల్లో ఏఐ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే ఏఐతో రూపొందించిన విజువల్స్ చూసి.. ఇక సినిమాలకు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని అనుకోవడం మాత్రం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మొబైల్ ఫోన్లలో చూసినప్పుడు ఏఐ విజువల్స్ చాలా అద్భుతంగా అనిపించవచ్చని.. కానీ అదే విజువల్‌ను 70 ఎంఎం బిగ్ స్క్రీన్‌పై చూస్తే అసలు నాణ్యత తెలుస్తుందని శోభు యార్లగడ్డ చెప్పారు. సినిమా అంటే కొన్ని సెకన్ల వీడియో క్లిప్ కాదని.. దాదాపు రెండున్నర గంటల పాటు సాగే కథ, భావోద్వేగాలు, పాత్రల ప్రయాణమని వివరించారు. ఒక సీన్ నుంచి మరో సీన్‌కు వెళ్లినప్పుడు పాత్రల ముఖ కవళికలు, శరీర కదలికలు, విజువల్ కంటిన్యూటీని కచ్చితంగా కొనసాగించే స్థాయికి ప్రస్తుత ఏఐ ఇంకా రాలేదని ఆయన పేర్కొన్నారు.

అందుకే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. సినిమా మేకింగ్‌లో మనుషుల ఆలోచన, కష్టం, నైపుణ్యం తప్పనిసరిగా ఉండాల్సిందేనని శోభు యార్లగడ్డ తెలిపారు. ఏఐను షార్ట్‌కట్‌గా ఉపయోగించి నాణ్యత విషయంలో రాజీ పడటం కంటే.. అవసరమైతే ఎక్కువ ఖర్చు పెట్టి రియలిస్టిక్ అవుట్‌పుట్ తీసుకురావడానికే రాజమౌళి వంటి దర్శకులు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ వ్యయంతో మోషన్ క్యాప్చర్ సెటప్ ఏర్పాటు చేయడం కూడా ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com